చిమ్మ చీకట్లో శ్రీలంక

ద్వీప దేశంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకకు మరో కొత్త కష్టం వచ్చింది. ఆ దేశంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్క సారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గంటల నుంచి కరెంటు లేకుండా పోయింది. దీంతో ఆ దేశంలోని హాస్పిటల్స్ లో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇతర అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది.  ప్రధాన ట్రాన్స్ మిషన్ లైన్లలోని ఓ వ్యవస్థ విఫలం కావడంతో శ్రీలంకలో ఈ పరిస్థితి తలెత్తిందని ఆ దేశ విద్యుత్, ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపిందని ‘ఏబీసీ’ న్యూస్ తెలిపింది. అందుకే విద్యుత్ అంతరాయం ఏర్పడిందని చెప్పింది. ఈ విద్యుత్ అంతరాయం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు. దశలవారీగా పునరుద్ధరణ జరుగుతోందని, విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు చెప్పారు.  శ్రీలంక విద్యుదుత్పత్తి కోసం ఎక్కువగా జలవిద్యుత్ పై ఆధారపడుతోంది. మిగిలిన లోటును పూడ్చేందుకు బొగ్గు, చమురును ఉపయోగిస్తారు. అయితే జలవిద్యుదుత్పత్తి చేసే ఆనకట్టల్లో నీటి మట్టాలు పడిపోవడంతో శ్రీలంకలో గత ఏడాది కొన్ని నెలల పాటు రోజువారీ విద్యుత్ కోతలు విధిస్తూ వస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించాయి. దీంతో విదేశాల నుంచి చమురు, బొగ్గు నిల్వలను దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోంటోంది. అందుకే ఈ విద్యుత్ సంక్షోభం తీవ్రమైంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, తీవ్ర ఆందోళనలు జరగడంతో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సను గద్దె దిగాల్సి వచ్చింది. ఏప్రిల్ 2022 లో 83 బిలియన్ డాలర్లకు పైగా రుణంతో ఆ దేశం దివాలాను ప్రకటించింది. కాగా కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హయాంలో నిరంతర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే విద్యుత్ ఛార్జీలను పెంచడం, వృత్తి నిపుణులు, వ్యాపారులపై భారీగా కొత్త ఆదాయపు పన్నులు విధించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అందుకే ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మద్దతును శ్రీలంక కోరుతోంది.

Leave A Reply

Your email address will not be published.