లీగల్ సెల్ పేరు తో వేదింపులు

.. లక్షకి 20 వేల కమిషన్ల తో వసూళ్లు

తెలంగాణా జ్యోతి వెబ్ న్యూస్ ప్రతినధి: లీగల్ సెల్ పేరు తో చీటీలకు పూచికత్వం ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేస్తున్న సంఘటనలు బాన్సువాడ నియోజకవర్గం లో అనేకం చోటుచేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే బాన్సువాడ పట్టణ కేంద్రంలో పలు చిట్ ఫండ్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో చీటీలు వేసి డబ్బులు చెల్లించని వారికి చిట్ ఫండ్స్ కంపెనీ వారు రూల్స్ ప్రకారం లీగల్గా వారికి నోటీసులు జారీ చేసి నగదును రికవరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలేమి చిట్ ఫండ్స్ కంపెనీ యాజమానులు పాటించకుండా కొంతమంది నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలకు చెందిన ప్రైవేటు వ్యక్తులను లక్షకి 20వేల రూపాయల కమిషన్ తో నియమించుకొని వారి చేత అగ్రిమెంట్లు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.  సదరు నిజామాబాద్ ,కామారెడ్డికి చెందిన వ్యక్తులు తమ సెల్ ఫోన్ లో ట్రూ కాలర్ లో పేరుకు బదులుగా లీగల్ సెల్ అని నమోదు చేసుకొని చీటీ బకాయి పడ్డ వారికి అదేవిధంగా వారికి గ్యారెంటీ ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతోపాటు అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు పలువురు బాధితులు బాహటంగానే పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం చీటీ వేసిన వ్యక్తికి గాని గ్యారెంటీ గాని ఎలాంటి ఫోన్లు చేయకుండా కేవలం నోటీసులతోనే వారి వద్ద నుండి డబ్బులు రికవరీ చేయాల్సి ఉండగా ఇలా ఫోన్లో చేసి ప్రైవేటు వ్యక్తులచే బెదిరింపులకు పాల్పడడం పలు చిట్ఫండ్స్ కంపెనీల యజమానుల వ్యవహార శైలి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వారు గ్యారెంటీగా ఉన్న వ్యక్తి యొక్క డబ్బులు చెల్లించాలంటూ వాళ్ళు విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లి సదరు వ్యక్తులు వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి చీటికి గ్యారెంటీగా ఉన్నట్లయితే వారు ముందస్తు సమాచారం గా నోటీసులు జారీ చేసి వారి యొక్క నెలసరి జీతం నుండి డబ్బులు కట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏకంగా ఉద్యోగి పని చేసే స్థానానికి వెళ్లి ఫోన్లు చేసి వేధింపులకు గురి చేయడం శోచనీయం. ఏది ఏమైనప్పటికీ పోలీస్ శాఖ అధికారులు వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.