2047 నాటికి కూడా పేద దేశంగానే ఇండియా    

రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారతదేశం ప్రస్తుతం సాధిస్తున్న 6 శాతం ఆర్థిక వృద్ధితో 2047 నాటికి కూడా దిగవ మధ్య ఆదాయ దేశంగానే ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. 6 శాతం వృద్ధి తక్కువేమీ కాదని, అయినా ఈ వృద్ధితో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదని చెప్పారు. 2047 నాటికి ఇప్పుడున్నంత జనాభా ఉన్నా.. ఈ ఆర్థిక వృద్ధితో మధ్య ఆదాయ దేశంగానే ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో మంథన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు.‘గత రెండు త్రైమాసికాల్లో భారత వృద్ధిరేటు 7.5 శాతం. కార్మికుల భాగస్వామ్యం పరంగా, ముఖ్యంగా మహిళా లేబర్‌ పార్టిసిపేషన్‌ పరంగా చూస్తే ఇది చాలా తక్కువ. జీ20 దేశాల్లో భారత్‌దే తక్కువ వృద్ధిరేటు. ప్రస్తుతం భారతదేశ వార్షిక అత్యధిక వృద్ధిరేటు 6 శాతం. అంటే ప్రతి 12 ఏండ్లకు, 24 ఏండ్లకు ఇది డబుల్‌ అవుతుంది. తలసరి ఆదాయం నాలుగింతలు పెరుగుతుంది. ప్రస్తుతం భారత్‌లో తలసరి ఆదాయం 2,500 డాలర్లు మాత్రమే. దీనిని నాలుగుతో గుణిస్తే 10 వేల డాలర్లు అవుతుంది. అంటే మరో 24 ఏండ్ల తర్వాత (2047) కూడా మనది పేద దేశంగానే ఉంటుంది’ అని వివరించారు.

విమర్శ సైద్ధాంతికంగా ఉండాలి

వ్యక్తుల మధ్య విమర్శలు సైద్ధాంతికంగా ఉండాలే కాని.. వ్యక్తిగతంగా ఉండకూడదని రఘురామ్‌రాజన్‌ అన్నారు. ఆయన రచించిన ‘బ్రేకింగ్‌ ది మౌల్డ్‌: రిమైనింగ్‌ ఇండియాస్‌ ఎకనమిక్‌ ఫ్యూచర్‌’ పుస్తక ప్రచారంలో భాగంగా వార్తాసంస్థ పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించటం సరికాదు. ఇతరుల ఉద్దేశాలను ప్రశ్నించవద్దు. దేశద్రోహి వంటి మాటలు వాడటం సరికాదు. నేను విశ్వగురువును.. నాకే అంతా తెలుసు అనుకోవటం మూర్ఖత్వం’ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.