రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి కి భారీ ఏర్పాట్లు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నగరంలోని జియాగూడలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర గల చారిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు అంగరంగ వైభవోపేతంగా, ఆకర్షణీయంగా ముస్తాబైంది. ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాలయ ట్రస్టీ ఎస్. తిరువెంగళాచార్యులు ఆలయ నిర్వాహకులు శృంగారం శేషాచార్యులు, అర్చకులు రాజగోపాలాచార్యులు బద్రినాథాచార్యులు, శ్రీనివాసరంగనాథ చార్యులు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ బోహిని దర్శన్ ఆదేశాల మేరకు ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి తరహాలోనే రంగనాథ దేవాలయాన్ని రకరకాల దేశీయ, విదేశీ సుగంధ పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆలయంలో ఈసారి వైకుంఠాన్ని పునఃసృష్టించారు.

 

తెల్లవారుజామునే శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం

 

ఈనెల 23న శనివారం తెల్లవారుజామున 2గంటలకు మూల రంగనాథస్వామికి, ఉత్సవ మూర్తులకు అభిషేకం, అలంకరణ, తోమాల సేవ, ఆరగింపు, షాత్తుమురై తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమౌతాయని దేవాలయ ట్రస్టీ ఎస్. తిరువెంగళాచార్యులు, నిర్వాహకులు శేషాచార్యులు పేర్కొన్నారు. సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున 5.00గంటలకు వైకుంఠనాథుడి ఆలంకరణలో గరుడ వాహనంపై ఆలయ వైకుంఠ ద్వారం నుంచి రంగనాథుడి ఊరేగింపు మొదలై శ్రీమన్నారాయణుడు గరుడ వాహనంపై ఆలయం వెలుపల భక్తులకు దర్శనమిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో, పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ముగిసిన తరువాత గరుడ వాహనంపై వేంచేసిన స్వామివారిని ఆలయంలో ఉత్తర దిశగా వైకుంఠ మండపంలో భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఉదయం 7గంటల నుంచి అర్ధరాత్రి వరకూ స్వామివారి ఉత్తర ద్వార దర్శన సౌకర్యాన్ని భక్తులకు కల్పించనున్నారు.

 

భారీ ఏర్పాట్లు

 

జియాగూడ రంగనాథస్వామి ఆలయంలో తిరుపతి తరహాలోనే సప్తద్వారాల నుంచి శ్రీవారిని దర్శించడం మరో విశేషం శ్రీవారు అలంకరణ ప్రియుడని అందుకే దేశ విదేశీ సుగంధ పుష్పాలు, పలాలలతో భారీ సెట్టింగులతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దిన విధానం భక్తులకు మధురానుభూతిని పంచనుంది ఇందుకోసం ఇప్పటికే ఆర్ అండ్ బి, జీహెచ్ఎంసీ వారు బారికేడ్లతో క్యూలైన్లను ఏర్పాటు చేశారు ధర్మదర్శనంతో పాటు వీఐపీ దర్శన సదుపాయం కల్పించారు విద్యుత్ శాఖ వారు నిరంతర విద్యుత్ సరఫరా కోసం మొబైల్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేశారు. జలమండలి అధికారులు తాగునీరు, వైద్య ఆరోగ్య శాఖ వారు ఉచిత వైద్య శిబిరం, అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటం ఏర్పాటు చేశారు కుల్సుంపురా పోలీసులు డోర్, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో భారీ భద్రత బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం నుంచే జియాగూడలోని ఆలయానికి దారితీసే మార్గాలలోకి వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ వారు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.