తెలంగాణ భవన్ లో ఘనంగా మాజీ ప్రధాని పి.వి నరసింహారావు వర్ధంతి

  పి.వి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శనివారం నాడు న్యూఢిల్లీ లోని  తెలంగాణ భ‌వ‌న్లో  మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.. తెలంగాణ భ‌వ‌న్ లోని అంబేడ్క‌ర్ ఆడిటోరియంలో రెసిడెంట్ క‌మిష‌న‌ర్ డా.గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరయ్యి పి.వి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు ఆర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ  “ పీవీ నరసింహారావు భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని అలాంటి పీవీ తెలంగాణలో పుట్టడం గర్వంగా భావిస్తున్నానన్నారు. చిన్న నాటి నుంచే పీవీకి దేశం అంటే చాలా ప్రేమ అని అదే విధంగా ఆయనకు అనేక భాషలపై మంచి పట్టుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు పీవీ నరసింహారావు అని అన్నారు. పీవీ నరసింహారావు ఎన్నో గొప్ప సాహస నిర్ణయాలు తీసుకున్నారు అని తెలిపారు. పీవీ పాలనా దక్షత ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచిందని,ఆయన పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకమని, దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా పీవీ కీలక భూమిక పోషించారన్నారు. అదే విధంగా పీవీ పాలనా దక్షత అనితర సాధ్యం అని ఆయన చెప్పారు. పీవీ ఆలోచనలను, మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భవిష్యత్ తరాలు నడుం బిగించడమే, మనం ఆయ‌న‌కిచ్చే నిజమైన నివాళి అని” అన్నారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ భవన్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.