నికెల్ ప్లాంట్ లో పేలుడు .. 13 మంది మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో చైనాకు చెందిన నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్‌లో పేలుడు సంభవించి 13 మంది కార్మికులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు వార్తా సంస్థ ఏపీ నివేదించింది. ఆదివారం లోహాలు కరిగించే కొలిమికి మరమ్మతులు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు చైనీస్, ఎనిమిది మంది ఇండోనేషియా కార్మికులు మరణించారని సెంట్రల్ సులవేసి పోలీసు చీఫ్ అగస్ నుగ్రోహో తెలిపారు. ఈ భయంకరమైన సంఘటన మొరోవాలి రీజెన్సీలోని బహోడోపి పరిసరాల్లోని పీటీ ఇండోనేషియా మొరోవాలి ఇండస్ట్రియల్ పార్క్ అనుబంధ సంస్థ పీటీ ఇండోనేషియా టీ సింగ్షాన్ స్టెయిన్‌లెస్ స్టీల్ దగ్గర జరిగింది.  నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్ చైనా ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పిలువబడే బహుళజాతి అభివృద్ధి కార్యక్రమం క్రింద నిర్మించారు.  పేలుడు శక్తివంతంగా జరగడంతో కొలిమి పూర్తిగా నాశనం అయ్యింది. భవనం ప్రక్క గోడలు కూడా ఈ పేలుడుతో దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా భారీగీ మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పడానికి నాలుగు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది.  కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధి డెడ్డీ కుర్నియావాన్ మాట్లాడుతూ “ఈ సంఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నాం. హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. ప్రమాదానికి కారణమేమిటో పరిశోధించడానికి అధికారులతో కలిసి పని చేస్తున్నాం” అన్నారు. ఇంతలో, ఫర్నేస్ దిగువన పేలుడు ద్రవాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది, దీనివల్ల సమీపంలోని ఆక్సిజన్ సిలిండర్లకు మంటలు అంటుకుని.. పేలుడుకు కారణమైందని తేలింది. ఇండోనేషియాలోని సెంట్రల్ సులవేసి ప్రావిన్స్ దేశంలోనే అతిపెద్ద నికెల్ నిల్వలు ఉన్నాయి. పీటీ ఐఎంఐపీ ఇండోనేషియాలో అతిపెద్ద నికెల్ ఆధారిత పారిశ్రామిక ప్రాంతం. ఇందులో 50% షేర్లు చైనీస్ హోల్డింగ్ కంపెనీకి చెందినవి. మిగిలినవి రెండు ఇండోనేషియా కంపెనీల యాజమాన్యంలో ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.