ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: స్వలింగ వివాహం.. ఆర్టికల్‌ 370 ఎత్తివేత.. జల్లికట్టు.. ఇలా పలు సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించి ఘనమైన తీర్పులను వెలువరించిన ఘనతను ఈ ఏడాది సుప్రీం కోర్టు దక్కించుకుంది. పలు సంచలన తీర్పులకు 2023 సాక్షిభూతంగా నిలిచింది. 2023లో సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని ప్రధాన తీర్పులను ఒకసారి పరిశీలిద్దాం.

 

నోట్ల రద్దు సబబే

 

నల్లధనం వెలికితీతకు 2016లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ నోట్ల రద్దుపై జారీ చేసిన నోటిఫికేషన్‌ చెల్లుతుందని పేర్కొంటూ 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.

 

జల్లికట్టుకు అనుమతి

 

ఎద్దులను లొంగదీసుకునే ప్రమాదకరమైన జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు మే నెలలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది.

 

రాహుల్‌కు ఊరట

 

ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైలు శిక్ష పడ్డ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సుప్రీం కోర్టు ఊరట కలిగించింది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల శిక్షతో పాటు ఆయన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని సైతం కోల్పోయారు. తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్లను కింది కోర్టు, గుజరాత్‌ హైకోర్టు తిరస్కరించినప్పటికీ ఈ కేసులో అతనికి పడ్డ శిక్షపై స్టే విధిస్తూ ఆగస్టు 4న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

స్వలింగ వివాహం చెల్లదు

 

స్వలింగ వివాహం చెల్లదంటూ అక్టోబర్‌లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం చారిత్రక తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు చట్టానికి అర్థం చెప్పి దానిని అమలు చేయగలదే తప్ప, కొత్తగా చట్టాలు చేయలేదని, ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు కేవలం పార్లమెంట్‌ ద్వారానే జరగాలని స్పష్టం చేసింది. స్వలింగ వివాహం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తీర్పు చెప్పింది. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదని పేర్కొంది.

 

విద్వేష ప్రసంగాలపై కేసులకు ఆదేశాలు

 

విద్వేషపూరిత ప్రంసగాలపై సుప్రీంకోర్ట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన నేరమని, దీని వల్ల దేశ లౌకిక వాదం ప్రభావితమవుతుందని తెలిపింది. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలపై ఫిర్యాదులు రాకున్నా కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు గమనిస్తే అనేక ముఖ్యమైన అంశాలపై తీర్పులు వెలువరించడమే కాక, చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక వివాదాలకు పరిష్కారం చూపింది. భవిష్యత్తులో ఆయా అంశాలపై వివాదాలకు తావు లేకుండా కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది.

 

370 ఆర్టికల్‌ రద్దు సరైనదే

 

370వ అధికరణ కింద జమ్ము-కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదాను 2019లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎత్తివేయడం సబబేనని డిసెంబర్‌ 11న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అన్నది ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దానిని రద్దు చేసే హక్కు రాజ్యాంగం ప్రకారం సంక్రమించినదేనని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Leave A Reply

Your email address will not be published.