తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ను కలిసిన వైఎస్‌ షర్మిల

  తన కుమారుడి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని ఆహ్వానం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ను కలుసుకున్నారు. తన భర్త అనిల్‌, కుమారుడు రాజారెడ్డితో కలిసి తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లారు. తన కుమారుడి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌తో దాదాపు 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం జగన్‌ ఇంటి నుంచి ఆమె తిరిగి వెళ్లిపోయారు.2021లో ఇడుపులపాయలో జగన్‌, షర్మిల కలుసుకున్నారు. మళ్లీ దాదాపు రెండేండ్ల తర్వాత అన్నాచెల్లెళ్లు కలుసుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. చాలాకాలం తర్వాత జగన్, షర్మిల కలుసుకోవడంతో ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగి ఉంటుందా అని పలువురు అంచనా వేశారు. అయితే 25 నిమిషాల పాటు మాత్రమే భేటీ కావడంతో రాజకీయాల గురించి కాకుండా.. కేవలం వ్యక్తిగత అంశాలపై మాత్రమే చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో కుమారుడి వివాహం నిశ్చయించినట్లు షర్మిల స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాలోని వైఎస్సార్‌ ఘాట్‌ను షర్మిల సందర్శించారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.