తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదల

ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ.. నామినేషన్ల స్వీకరణ      29న ఎన్నికల పోలింగ్‌ .. ఫిబ్రవరి 1న ఫలితాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలోని రెండు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపింది.అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనున్నది. 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుంది. 29న ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఫిబ్రవరి 1న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. తెలంగాణలోని రెండు స్థానాలతో పాటు యూపీలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.