ముంబై లోని పలు సంస్థలకు బాంబు బెదిరింపులు కలకలం

ఛత్రపతి శివాజీ మ్యూజియం సహా 8 సంస్థలకు బాంబు బెదిరింపులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ముంబై లోని పలు సంస్థలకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 8 సంస్థలను లక్ష్యంగా చేసుకొని కొందరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై కొలాబా ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ మ్యూజియం వర్లీలోని నెహ్రూ సైన్స్‌ సెంటర్ బైకుల్లా జూ సహా పలు సంస్థలను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరించారు. శుక్రవారం సాయంత్రం ఆయా సంస్థలకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా మ్యూజియంకు బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు చెప్పారు.బెదిరింపు మెయిల్స్‌తో అప్రమత్తమైన అధికారులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా బెదిరింపులు వచ్చిన సంస్థల వద్దకు బాంబ్‌ స్వ్కాడ్‌ చేరుకొని తనిఖీలు చేపట్టింది. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. ఆయా సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్స్‌ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు కొలాబా పోలీస్‌ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని పలువురు ప్రముఖులు, పారిశ్రామివేత్తలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో ముంబైలోని పలు బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్‌ ఇండియా మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీ, జైపూర్‌, లక్నో, చండీగఢ్‌, ముంబై, చెన్నై, అమ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు కొందరు ఆగంతకులు ఈమెయిల్‌ ద్వారా బెదిరించారు. గురువారం కూడా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం తో సహా పేల్చేస్తామంటూ సీఎంను బెదిరించారు. ఆ తర్వాత నిన్న అంటే శుక్రవారం కోల్‌కతా లోని ఇండియన్‌ మ్యూజియం కు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.