కేంద్రమంత్రి కి తప్పిన ప్రమాదం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలాకు వినూత్న అనుభవం ఎదురైంది. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హజరయ్యేందుకు పురుషోత్తం రూపాలా.. చిలుకా సరస్సులో పడవలో బయల్దేరారు. అయితే ఆ పడవ దారి తప్పడంతో ఆ సరస్సులోనే చిక్కుకుపోయింది. చేపలు పట్టేందుకు మత్స్యకారులు వేసిన వల అడ్డుపడి సరస్సులో పడవ చిక్కుకుపోయిందని మొదట భావించారు. అయితే తాము వెళ్లాల్సిన దారి తప్పడంతో 2 గంటల పాటు ఆ సరస్సులోనే ఇరుక్కుపోయినట్లు బయటికి వచ్చిన తర్వాత కేంద్రమంత్రి వివరించారు.11 వ విడత సాగర్‌ పరిక్రమ పథకంలో భాగంగా కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా.. ఒడిశాలో మత్స్యకారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కూడా ఆయన మత్స్యకారులతో భేటీ కావాల్సి ఉంది. అందుకోసం ఖోర్ధా జిల్లాలోని బర్కుల్‌ నుంచి పూరీలోని సాత్‌పాడాకు చిలుకా సరస్సులోని ఓ పడవలో కేంద్రమంత్రితోపాటు ఆయన సిబ్బంది, అధికారులు బయలుదేరారు. అయితే పడవ నడిపే వ్యక్తికి ఆ మార్గం కొత్త కావడం.. అదే సమయంలో చీకటి కూడా పడటంతో అతను దారి గుర్తించలేకపోయాడని కేంద్రమంత్రి భద్రతాధికారి తెలిపారు. ఈ ఘటన సమయంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా కూడా కేంద్రమంత్రితో ఉన్నారు.అయితే ఎంతకీ కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న పడవ గమ్యాన్ని చేరకపోవడంతో ఒడ్డున ఉన్న అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మరో పడవను పంపి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలాతోపాటు ఆయనతో ఉన్న అధికారులు, సిబ్బందిని ఒడ్డుకు తీసుకొచ్చారు. తాము వెళ్లాల్సిన దారి తప్పిపోవడంతో సతపద చేరుకోవడానికి మరో 2 గంటలు పట్టిందని కేంద్రమంత్రి తెలిపారు. దీంతో అనుకున్న సమయం కంటే ఎక్కున సమయం పట్టడంతో ఆ కార్యక్రమం రద్దయినట్లు అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.