ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పెరుగుతున్న దిక్కారస్వరాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార వైసీపీలో ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి రంగం సిద్ధం చేసుకోగా.. సోషల్ మీడియా వేదికగా మరికొందరు సిట్టింగులు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా.. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నిర్వేదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్ లైవ్‌లో పద్మావతి తన ఆవేదనను వెలిబుచ్చారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తోందన్నారు. ఇక్కడి రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారన్నారు. ఈ విషయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా చూస్తాం చేస్తాం అని చెప్పడం తప్ప.. సమస్యను ఏనాడూ పరిష్కరించలేదని పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మాకే ఎందుకింత అన్యాయం..?

 

2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనం వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని పద్మావతి ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా..? అని నిలదీశారు. అలా అయితే నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక్క రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే తాను ఎమ్మెల్యే కాలేదని… కులాలకు, మతాలకు అతీతంగా తనను శింగనమల ఎమ్మెల్యేగా గెలిపించారని పద్మావతి అన్నారు. పద్మావతి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో జొన్నలగడ్డ పద్మావతి తన ఆవేదనను వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే.. పద్మావతి రాజీనామా రెడీగానే ఉన్నారని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.