రేపు హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ రాక

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. జాతీయ నేతలు ప్రచారంలో బిజీ అవుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఈసారి హైట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. మొదట ఈనెల 16న ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తారని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం వచ్చినా.. తాజాగా ఈనెల 15ననే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. కాగా, 10 రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడు మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం మల్కాజ్‌గిరిలోమోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. అలాగే 16న నాగర్ కర్నూల్, 18న జగిత్యాలలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఇక, నాగర్ కర్నూల్ లోని వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు జిల్లా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ తొలిసారి నాగర్‌కర్నూల్‌కు వస్తున్నందున భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. అందుకోసం సభకు ఉమ్మడి జిల్లా, బీజేపీ పట్టు ఉన్న ప్రాంతాల నుంచే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలింగే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రధాని ఎన్నికల ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.