మహిళలకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయల సహాయం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ సహా ఐదు ‘మహిళా న్యాయ’ హామీలను కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బుధవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తామని ఏఐసీసీ కమ్యూనికేషన్ల వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ హామీ ఇచ్చారు. ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మహిళల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన గాంధీ, ఐదు ‘మహిళా న్యాయ’ హామీలను ప్రకటించారు. పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.లక్ష జమ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో తమ పార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఆశా (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌) వర్కర్లు, అంగన్‌వాడీలు (ప్రభుత్వం అధ్వర్యంలోని మహిళా శిశు సంరక్షణ కేంద్రాలు), మధ్యాహ్న భోజన పథకాల్లో పనిచేస్తున్న మహిళలకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను రెట్టింపు చేస్తామని గాంధీ హామీ ఇచ్చారు. మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు వారి కేసుల పోరాటంలో సహాయం చేసేందుకు నోడల్‌ అధికారిని నియమిస్తామన్నారు. అలాగే, దేశంలోని ప్రతి జిల్లాలో మహిళల కోసం సావిత్రీబాయి ఫూలే హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని రాహుల్‌ గాంధీ తన ఐదు హామీలను వివరించారు. ఈ సందర్భంగా తాను కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు (తన మునుపటి భారత్‌ జోడో యాత్రలో) 4 వేల కిలో మీటర్లు నడిచానని, లక్షలాది మందితో సంభాషించానని కాంగ్రెస్‌ నాయకుడు చెప్పారు. పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారని, రైతులు, యువతకు రుణాలు మాఫీ చేయలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇంతకంటే పెద్ద అన్యాయం మరొకటి ఉండదన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ‘భాగిదారీ’ (భాగస్వామ్య) ప్రతిపాదన అంటే అన్ని కులాలు, వర్గాలను వారి జనాభా ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం, వనరులను పంచుకోవడం అని ఆయన అన్నారు. రిజర్వేషన్ల విషయంలో (లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో) మహిళలను కేంద్రం మోసం చేసిందని, దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించిందని, అయితే దాని అమలుకు 10 ఏళ్లు పడుతుందని గాంధీ తెలిపారు. తక్షణమే మహిళా రిజర్వేషన్లను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ ప్రసంగానికి ముందు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే  ఒక వీడియో ప్రకటనలో మహాలక్ష్మి గ్యారెంటీ ద్వారా పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.లక్ష నేరుగా జమ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘ఆధి ఆబాది పుర హక్‌’ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ హామీలు ‘పత్తర్‌ కి లేకర్‌’ (రాతితో అమర్చబడినవి), ‘జుమా’ కాదని ఖడ్గే నొక్కి చెప్పారు. అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకాల్లో పనిచేస్తున్న ఆశా, మహిళలకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ వాటాను రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ‘అధికార్‌ మైత్రి’ లేదా నోడల్‌ వ్యక్తి మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పిస్తారని, వారి ప్రయోజనాల కోసం పోరాటంలో సహాయపడతారని వివరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జైరాం రమేశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని రద్దు చేస్తామన్నారు. గత కాంగ్రెస్‌ హయాంలో ప్రవేశపెట్టిన షెడ్యూల్డ్‌ కులాల ప్రణాళిక, షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళికలను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ‘జనాభా (వివిధ కులాలు, వర్గాల) ప్రకారం బడ్జెట్‌ వాటాను నిర్ధారించడానికి మేము చట్టాన్ని తీసుకువస్తాము’ అని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.