మరో కోవిడ్ వేరియంట్ ఎక్స్బీబీ కల్లోలం.. కేంద్ర అధికారుల కీలక భేటీ!

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : గత రెండేళ్లు కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించింది. కొన్ని లక్షల మంది దీని ధాటికి బలయ్యారు. మరెన్నో లక్షల మంది కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్తో ఇప్పటికీ జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం కోవిడ్ కుప్పకూల్చింది. అయితే వ్యాక్సిన్ల రాకతో ఈ మహమ్మారికి కొంతవరకు అడ్డుకట్ట పడింది. అయితే కొత్త రూపు తీసుకుని.. కొత్త రకం వేరియంట్లతో మళ్లీ మానవాళిపై కోవిడ్ భూతం విరుచుకుపడుతూనే ఉంది.మన దేశంలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ.. కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో మహారాష్ట్ర కేరళలలో ఒమిక్రాన్ ఉపరకాలు అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలు సర్వత్రా ఆందోళన రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ.. తాజాగా వైద్య నిపుణులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. కరోనా కొత్త వేరియంట్లను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా మాస్కులు ధరించడం కొవిడ్ నిబంధనలు పాటించడాన్ని కొనసాగించాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సూచనలు జారీ చేసింది.ఈ మేరకు దేశంలో పలు ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య నిపుణులతో ఆ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తాజా సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఎంటాగీ చైర్మన్ ఎన్కే అరోఢా వ్యాక్సిన్ గ్రూప్ సభ్యులు ఈ భేటీకి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్లపై చర్చించిన నిపుణులు.. దేశవ్యాప్తంగా మాస్కులు కొవిడ్ నిబంధనలు పాటించడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.కాగా మహారాష్ట్రలో గతవారంలో నమోదైన కరోనా కేసుల్లో 17.7 శాతం పెరుగుదల కనిపించడం గమనార్హం. వీటిలో ఎక్కువగా ఒమిక్రాన్ ఉపరకమైన ఎక్స్బీబీ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న బీఏ.2.75తో పోలిస్తే ఎక్స్బీబీ విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా ఎక్స్బీబీకి రోగనిరోధకతను తప్పించుకునే లక్షణాలు కూడా ఉన్నాయని బాంబుపేల్చారు.ఎవరికైనా ఫ్లూ మాదిరి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని.. వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు సైతం ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎక్స్బీబీతో పాటుగా మొదటిసారి మహారాష్ట్రలో బీఏ.2.3.20 బీవో.రకాలనూ సైతం గుర్తించారు. ఇవి భారత్లో మరో కొత్త వేవ్కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు కేరళలో పలు చోట్ల ఎక్స్బీబీ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్లో మార్పులతో కొత్త రకాలు పుట్టుకొస్తున్నందున.. వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బీఏ2.75 బీజే.రకాలు కలిసి ఎక్స్బీబీ సబ్ వేరియంట్గా ఏర్పడినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఎక్స్బీబీని ఇప్పటికే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఒడిశా తమిళనాడుల్లో గుర్తించడం గమనార్హం.అంతేకాకుండా సింగపూర్ యూఎస్లో సైతం కరోనా కేసుల పెరుగుదలకు ఈ రకమే కారణమని అంచనా వేస్తున్నారు. దీనికి బీఏ2.75 కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉందని భారత ఆరోగ్య శాఖ బాంబు పేల్చింది.

Leave A Reply

Your email address will not be published.