మాచర్లలో మళ్లీ హై అలర్ట్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పల్నాడు జిల్లా మాచర్లలో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. తెలుగు దేశం పార్టీ నేతలు ఇవాళ ఛలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.. ఎక్కడికక్కడే టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఛలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ మలిక తెలిపారు. ముందుగానే మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద బాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మరెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వైఎస్సార్‌సీపీ నేతల దాడిలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు కూడా వెళ్లనివ్వరా అంటూ ప్రశ్నించారు.టీడీపీ ఛలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించాలని భావించారు. మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి ఇంటి నుంచి బృందం బయలుదేరాలని భావించింది. పోలీసులు మాత్రం అనుమతి లేదంటున్నారు.ఛలో మాచర్లకు పిలుపునివ్వడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యగా అదనపు బలగాలను మోహరించారు.ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పోలింగ్ జరిగిన నాటి నుండి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ అతని అనుచరులు కలిసి దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.మాచర్లలో పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలకు ప్రజలు బెంబేలెత్తిపోయారన్నారు అచ్చెన్న. ఈ అరాచకాలన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్నా వైఎస్సార్‌సీపీ గూండాలకు అడ్డుచెప్పడం మానేసి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజున పిన్నెల్లి స్వయంగా ఈవీఎమ్ ను బద్దలు కొట్టడం, టీడీపీకి ఓటు వేసిన సానుభూతి పరులపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు వైఎస్సార్‌సీపీ ఓటమి పాలవుతుందని భయంతో అరాచకాలకు సృష్టిస్తున్నారన్నారు. ఈ ఘటనలపై ఎన్నికల కమీషన్, పోలీసు వ్యవస్థ పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు.పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 13న పోలింగ్ రోజుతో పాటూ ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ మలిక రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోటలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.ఆ రెండు గ్రామాల్లో పికెట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.