ఇంజనీరింగ్ లో కొత్తగా పదివేల కంప్యూటర్ సైన్స్ సీట్లు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అదనంగా మరో 10 వేల సీట్లు పెరుగనున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సులకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం(2024-25)లోనే ఈ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది కన్వీనర్ కోటా కింద భర్తీ అయిన సీట్లలో కంప్యూటర్ సైన్స్ సీట్లదే అగ్రస్థానం. గత విద్యాసంవత్సరంలో దాదాపు 68 సీట్లు ఆ బ్రాంచీలవే కావడం విశేషం. ఈ సీట్లకు తోడు ఈసారి మరో 10 వేల సీట్లు అదనంగా రానున్నాయి. సీట్ల సంఖ్య పెరిగితే మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా (70 శాతం) కింద మొత్తం 83,766 బీటెక్ సీట్లు ఉండగా… అందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లోనే 56,811 సీట్లు ఉన్నాయి. అంటే ఆ బ్రాంచీల వాటానే 68 శాతంతో సమానం. ఇక రాష్ట్రంలోని అయిదు ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలను కలుపుకొంటే మొత్తం 75 శాతం వరకు సీట్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అయితే వాటిలో తగిన మౌలిక వసతుల వెసులుబాటు చూపిస్తే.. ఎన్ని సీట్లకైనా అనుమతిస్తామని ఏఐసీటీఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. అంటే పెంచుకునే సీట్లకు అనుగుణంగా క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, టీచింగ్ స్టాఫ్ చూపితే చాలు కొత్త సీట్లకు అనుమతి లభించనట్లే.

రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్ సంబంధిత సీట్ల (Computer Science Seats) సంఖ్య ఇప్పటికే 75 శాతానికిపైగా ఉండగా.. ఈసారి మరిన్ని సీట్లు పెరుగున్నాయి. సీట్ల సంఖ్యపై ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేయడంతో సీట్లు భారీగా పెరునున్నాయి. నిబంధనలను పాటించే కళాశాలలకు ఒక్కో విభాగానికి 240 సీట్లకు మించి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వడంలేదు. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) గుర్తింపు ఉంటే ఆ పరిమితికి మించి సీట్లు తెచ్చుకోవచ్చు. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోనే 46 వరకు అటానమస్ కళాశాలలు ఉండటం గమనార్హం. కనీసం సగం కళాశాలలు అంటే 50 కళాశాలల వరకు దరఖాస్తు చేసుకొని ఒక్కో సెక్షన్ పెంచుకున్నా 1500 సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి.

Leave A Reply

Your email address will not be published.