తిరుమల పవిత్రతను కాపాడాలి

.. ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని.. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని.. శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభమైందన్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభమవుతుందని.. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు.. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభ్యమయ్యేలా చేశారని.. వాటిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. 2003లో అలిపిరిలో జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి నుంచి ఆ వేంకటేశ్వరస్వామి కాపాడారని.. తనను ప్రాణాలతో బయటపడేశారన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతోనే రాష్ట్రానికి మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నామని గుర్తు చేశారు చంద్రబాబు.తన రాజకీయ జీవితంలో గతంలో ఎన్నో ఎన్నికలు చూశానని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు చంద్రబాబు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్నారు. ఆర్థిక అసమానతలు లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలనేది తన లక్ష్యమన్నారు. కుటుంబ వ్యవస్థ పెద్ద సంపదని.. ఎనర్జీని రీఛార్జ్‌ చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే అండగా నిలిచే భాగస్వాములు ఉంటారని.. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అండగా నిలబడ్డారన్నారు ఏపీ సీఎం.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలని.. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి, పోలవరంను పూర్తి చేయడమే లక్ష్యమని.. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని చెప్పారు. గతంలో కుటుంబానికి సమయం కేటాయించలేదన్న చంద్రాబబు.. ఇప్పుడు కేటాయిస్తానని చెప్పుకొచ్చారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో తాను తొలిసారి సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేదన్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేశామని.. సరికొత్త పాలన ప్రారంభించామన్నారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశామని.. సంపద సృష్టించి,దాన్ని పేదలకు పంచాలన్నారు. రాష్ట్రంలో పరదాలు, చెట్లు కొట్టడం వంటివి ఇకపై ఉండవని.. నేరస్థుల్ని సహించేది లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.