ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా .. ఆయనే ఫిక్స్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: స్పీకర్ పదవిపై చంద్రబాబు దాదాపుగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే (నర్సీపట్నం), బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు చీఫ్ విప్ పదవిపైనా చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారని.. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.అసెంబ్లీ స్పీకర్ రేసులో అయ్యన్నపాత్రుడితో పాటుగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరు వినిపించింది. అయితే అయ్యన్నపాత్రుడివైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే అయ్యన్నపాత్రుడి ఎంపికపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 18న కేబినెట్ సమావేశం.. 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ప్రొటెం స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.. అయ్యన్నాపాత్రుడు 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. అయ్యన్నపాత్రుడు 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024ల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచే శారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కుతుందని భావించారు.. కానీ యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో సీనియర్లకు అవకాశం దక్కలేదు.ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తండ్రి వీరయ్య చౌదరి తర్వాత టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో పొన్నూరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1994, 1999, 2004, 2009, 2014లో గెలిచారు. 2019లో ఆయన ఓడిపోగా.. 2024లో 32,915 ఓట్ల తేడాతో గెలుపొందారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చంద్రబాబు కేబినెట్‌‌లో మంత్రి పదవి ఆశించారు.. కానీ ఈసారి సీనియర్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే ధూళిపాళ్ల సీనియర్ నేత కావడంతో చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.