యాక్సిడెంట్ బాధితులకు లక్ష రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ 

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రోడ్డు సెఫ్టీపై అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో అమాయకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. వారు సరైన డైరెక్షన్‌లోనే వెళ్తున్నా.. ఎదురుగా వచ్చేవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక క్షతగాత్రులు వైద్యం కోసం నానాతిప్పలు పడాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్‌కు గురైన బాధితులకు సత్వరమే వైద్యం సాయం అందిచటంతోపాటు ఆర్థిక వెసులుబాటు కలిగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.యాక్సిడెంట్‌కు గురైన బాధితులకు కోరుకున్న ఆసుపత్రుల్లో రూ.లక్ష వరకు ఉచిత వైద్యంపై కసరత్తు జరుగుతోందని వైద్యోరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ పథకం నిబంధనల ప్రకారం యాక్సిడెంట్‌కు గురైన క్షతగ్రాతులను ప్రైవేటు హాస్పిటల్‌కు తరలిస్తే.. వారికి రూ. ఒక లక్ష వరకు ఉచితంగా ట్రీట్‌మెంట్ అందించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. యాక్సిడెంట్ బాధితులను ఆదుకునేందుకు మానవతా ధృక్పథంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి దామోదర వెల్లడించారు.ఇక కార్పొరేట్‌, ప్రైవేట్‌ హాస్పిటల్స్ నియంత్రణకు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టును త్వరలోనే అమలు చేయనున్నామని చెప్పారు. అందుకోసం ఒక స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించాలని తమ ప్రభుత్వం డిసైడ్ అయిందని వెల్లడించారు. ఈ మేరకు వచ్చే 15 రోజుల్లో ప్రైవేటు హాస్పిటల్స్‌లో తనిఖీలు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.