ఫేమస్ హోటల్ లో పాడైపోయిన బిర్యాని

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏ మాత్రం శుభ్రత లేకుండా ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపు లేకుండా పాడైపోయిన వస్తువులతో ఆహారపదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. డేట్ అయిపోయిన వస్తువులతో వండి వడ్డిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్‌ నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లపై వరుసగా దాడులు చేసిన ఫుడ్ సెప్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారుల అక్కడి పరిస్థితులు చూసి షాక్‌కు గురయ్యారు. తాజాగా.. జంట నగరాల్లో ఫేమస్ అయిన సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో ఫుడ్ సెఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. నాసిరకం వస్తువులతో పాటు కిచెన్‌లో అద్వాన పరిస్థితులను అధికారులు గుర్తించారు. పాడైపోయిన మటన్‌తో బిర్యాని తయారుచేసి వండిపెడుతున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఫుడ్ తయారుచేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతూ.. ఆర్డర్ల మేరకు అప్పటికప్పుడు వేడి చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది.ఆల్ఫా హోటల్ నిర్వహకులు స్వయంగా తయారు చేసే బ్రెడ్‌తో పాటు ఐస్‌క్రీమ్, టీ పొడి కూడా నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. బ్రెడ్, ఐస్‌క్రీమ్, టీ పొడి డేటు, బ్యాచ్ లేకుండా తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. కిచెన్ మొత్తంలో అపరిశుభ్రంగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్‌పై కేసు నమోదు చేయటంతో పాటు రూ. 1 లక్ష ఫైన్ విధించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. కాగా, గతంలోనూ ఆల్ఫా హోటల్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి దారుణ పరిస్థితులు చూసి హోటల్‌ను సీజ్ కూడా చేశారు. ఇటీవల తిరిగి ఓపెన్ కాగా.. మరోసారి హోటల్ నిర్వాహకుల దారుణాలు వెలుగులోకి వచ్చాయి

Leave A Reply

Your email address will not be published.