విద్యార్థుల అల్పాహారంలో ప్రత్యక్షమైన బల్లి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పట్టణంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం బాలికల హాస్టల్‌లో దారుణం ఘటన వెలుగు చూసింది. శుక్రవారం (జూన్ 21) విద్యార్థినులకు వడ్డించిన అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) లో బల్లి ప్రత్యక్షమైంది. ఈ ఘటన శనివారం ఆలస్యంగా బయటకు వచ్చింది. విద్యార్థులు బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా.. ఓ స్టూడెంట్ ప్లేట్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో విద్యార్థులు భయంతో ప్లేట్లు అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్టూడెంట్స్ వార్డెన్, కేర్‌టేకర్ల దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవటంతో విద్యార్థినులు, వివిధ సంఘాల నాయకులు రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరిని కలిశారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఘటనకు బాధ్యుడైన హెడ్‌కుక్‌ రాజేశ్‌ను చీఫ్‌ వార్డెన్‌ మహేందర్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో సరైన వసతులు ఉండవనే ఆరోపణలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. వసతి గృహల్లో పరిశుభ్రత పాటించటంలేదని.. విద్యార్థులకు వంటకు ఉపయోగించే సరుకుల్లో నాణ్యత తక్కువగా ఉంటుందని విమర్శలున్నాయి. ఇక విద్యార్థుల తినే భోజనాల్లో, మంచినీటి ట్యాంకులో చనిపోయిన కప్పలు, ఎలుకలు, బొద్దింకలు కనిపించిన ఉదంతాలున్నాయి. తాజాగా.. బ్రేక్‌ఫాస్ట్‌లో బల్లి ప్రత్యక్ష్యం కావటం పట్ల స్డూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.