29 న అమర్నాథ్ యాత్ర ప్రారంభం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  హిమాలయాల్లోని మంచు కొండల్లో కొలువైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతుండటంతో అమర్‌నాథ్ యాత్రికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అధికారులు మాత్రం పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసి.. అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకునే భక్తుల కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29 వ తేదీన ప్రారంభం కానున్న ఈ అమర్‌నాథ్ యాత్ర కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక అమర్‌నాథ్ యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభానికి గుర్తుగా శనివారం నిర్వహించిన ప్రథమ పూజలో జమ్మూ కాశ్మీర్‌ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌గా గవర్నర్ మనోజ్ సిన్హా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న యాత్ర ప్రారంభం అయిన తర్వాత దేశవ్యాప్తంగా యాత్రికులకు అమర్‌నాథ్ మంచు లింగం భక్తులకు కనువిందు చేయనుందని చెప్పారు. దేవస్థానం బోర్డు, జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గత రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్రకు సౌకర్యాలు చాలా మెరుగయ్యాయని చెప్పారు. ఆలయ గుహకు వెళ్లే రహదారులకు మరమ్మతులు నిర్వహించి.. సౌకర్యవంతంగా చేసినట్లు వెల్లడించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ – బీఆర్‌ఓ కొన్నిచోట్ల రోడ్లను వెడల్పు చేసిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.