ప్రధాని నరేంద్ర మోడీ పై కేసు నమోదు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రజల సంపదను పంచుతుందని ప్రధాని చేసిన ప్రసంగంపై కేసు దాఖలైంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో తాజాగా ఫిర్యాదు చేశారు.
జియావుర్ రెహ్మాన్ అనే వ్యక్తి.. బెంగళూరు కోర్టును ఆశ్రయించి ప్రధాని మోదీపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ప్రకారం సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో రాజస్థాన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడ నిర్వహించిన సభలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాడు. అవి దేశ ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని జియావుర్ రెహ్మన్ కోర్టుకు తెలిపాడు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి దేశ సంపదను మొత్తం ముస్లింలకు మాత్రమే పంచాలని భావిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలపై జియావుర్ రెహ్మాన్ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో సంపద, ఆదాయ అసమానతలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చేజిక్కించుకుంటే ప్రైవేటు ఆస్తులను మళ్లీ పంచాలని చూస్తోందని పేర్కొన్నారు. దేశసంపదను ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ పంచుతుందంటూ మతపరమైన ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించిందని మోదీ చెప్పడం పెను సంచలనానికి తెరతీశారు.

దేశంలోని వనరులపై ముస్లింలదే మొదటి హక్కు అని 2006లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దేశంలోని ప్రజల సంపదను చొరబాటుదారులకు, ఎక్కువమంది సంతానం ఉన్నవారికి అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని చెప్పారు. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఎన్నికల ప్రచారంలో మోదీ అప్పట్లో ఈ ఆరోపణలు చేశారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో హిందూ, ముస్లింల మధ్య విద్వేషంతో పాటు భయాలను రేకెత్తించాయని పలువురు మేధావులు సైతం మోడీ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.