చనిపోయిన బాలికను బతికిస్తానని 24 సం.ల క్రితమే సినిమా చూపించిన భోలే బాబా 

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట ఘటన యావత్తు దేశాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. పోలీస్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా మారిన నారాయణ్ సకార్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా మంగళవారం నిర్వహించిన సత్సంగ్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఎఫ్ఐఆర్‌లో తొలుత ఆయన పేరు మాత్రం చేర్చలేదు. విమర్శలు వెల్లువెత్తడంతో పేరును చేర్చారు. కానీ, నిందితుడిగా మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. భోలే బాబాకు అతీంద్రయ శక్తులు ఉన్నాయని ఆయనను అనుసరించే భక్తులు నమ్ముతారు. బాధలను నివారిస్తాడని, దెయ్యాలు, భూతాలను వదిలించి, తమ కోరికలను తీర్చగల మాంత్రిక శక్తులు కలిగి ఉన్నాడని గుడ్డిగా అనుసరిస్తున్నారు.వాస్తవానికి ఆయన 2000 సంవత్సరంలోనే ఓ కేసులో అరెస్టయి జైలుకెళ్లారు. తనకు దివ్యశక్తి ఉందని ఆగ్రాలో ఓ 16 ఏళ్ల బాలిక చనిపోగా.. ఆమెను తిరిగి బతికిస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బలవంతంగా మృతదేహాన్ని తీసుకెళ్లాడనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదయ్యింది. తర్వాత ఈ కేసును పోలీసులు మూసివేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలోఅధర్వణ వేదాభ్యాసుకుడైన హీరోయిన్ తండ్రి తాను సాధించిన సిద్ధుల ద్వారా పక్షవాతంతో బాధపడుతోన్న తన భార్య ఆత్మను చనిపోయిన బాలికలోకి ప్రవేశపెట్టి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తాడు. అచ్చం భోలే బాబా కూడా అలాగే చేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి.యూపీ పోలీస్ విభాగంలో రెండు దశాబ్దాలు కానిస్టేబుల్‌గా పనిచేసిన సూరజ్ పాల్.. తనకు మానవతీత శక్తులు ఉన్నాయని ప్రకటించుకుని ఆధ్యాత్మిక గురువు అవతారం ఎత్తారు. ఈయన అనుచరుల్లో దళిత కుటుంబాలు, కార్మికులు, మేస్త్రీలు, వ్యవసాయ కార్మికులు, సఫాయి కర్మచారులు, వడ్రంగులు వంటివారే ఎక్కువగా ఉన్నారు.మరోవైపు, తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకూ పోలీసులు.. ఆరుగురిని అరెస్టు చేయగా.. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. భోలే బాబా సత్సంగ్‌లో వాలంటీర్లుగా వ్యవహరించే వీరు.. తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టినట్టు పోలీసులు గుర్తించారు. వారు విఫలం కావడంతో తొక్కిసలాట జరిగి 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ పరారీలో ఉండగా.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది.కాగా, భోలే బాబా ఆచూకీ ఇంకా దొరకలేదని, అతడు దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్‌ ఐజీ శాలభ్‌ మాథుర్‌ వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.