డ్వాక్రా సంఘాలకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రయివేట్ సేవలను ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందిస్తోన్న మీ సేవ కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ మీ సేవా కేంద్రాల ఏర్పాటు బాధ్యతలను సర్కారు అప్పగించనుంది. అందుకోసం ముందుకొచ్చే డ్వాక్రా సంఘాలకు అనుమతులు మంజూరు చేయనుంది. మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తిచూపే డ్వాక్రా సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఈ మేరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, వచ్చే ఆగస్టు 15 నాటికే గ్రామాల్లో మీ-సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,525 మీ సేవ కేంద్రాలు ఉండగా.. వీటిలో 3 వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలుండగా.. 1,500 వరకే మాత్రమే గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి. పలు ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్‌ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ సేవలు, 600కు పైగా ప్రైవేటు సేవల కోసం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పట్టణాలు, నగరాల్లోని మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave A Reply

Your email address will not be published.