34 ఏండ్ల తర్వాత తెరుచుకున్న పురాతన ఆలయం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జమ్మూ కశ్మీర్‌లో మూడు దశాబ్దాలకుపైగా మూసి ఉన్న అమ్మవారి ఆలయం ఆదివారం తెరచుకుంది. అనంత్‌నాగ్‌లోని షాంగుస్ తాలూకాలోని ఉమా భగవతి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమక్షంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఉమా దేవి విగ్రహాన్ని రాజస్థాన్‌ నుంచి తెప్పించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు. 34 ఏళ్ల తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరించినట్టు కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అభివృద్ధితో పాటు లోయలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.బరారింగన్‌లోని ఉమా భగవతి ఆలయం అత్యంత పురాతనమైంది. కూల్చివేయడానికి ముందు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోడానికి జమ్మూ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం ‘బ్రహ్మ కుండ్, విష్ణు కుండ్, రుద్ర కుండ్, శివ శక్తి కుండ్’లతో సహా ఐదు నీటి బుగ్గల మధ్య ఉంటుంది. ఉమా నగ్రి, పరిసర ప్రాంతాల గ్రామస్తులు కశ్మీర్‌లోని ప్రశాంతమైన రోజులను గుర్తుచేసుకున్నారు. అడవి మధ్య ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి స్వాంతన, మానసిక ప్రశాంతత కోసం వచ్చేవారమని తెలిపారు. ఆలయాన్ని తిరిగి తెరవడంతో కశ్మీరీ పండిట్లతో పాటు ముస్లింలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.‘మా పండిట్ సోదరులకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం.. 34 ఏళ్ల తర్వాత ఆలయంలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది’ అని గుల్జార్ అహ్మద్ అనే స్థానిక ముస్లిం అన్నారు. గతంలో ఈ ఆలయంలో ఏటా జరిగే కొద్ది రోజుల పాటు ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చేవారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.