రెండు రోజులుగా లిఫ్టులో ఇరుక్కుపోయిన వ్యక్తి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉళ్లూరు ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల రవీంద్రన్‌ నాయర్‌ గత శనివారం మెడికల్‌ చెకప్‌ కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ (Thiruvananthapuram government medical college) ఆసుపత్రికి వెళ్లారు. అవుట్ పేషెంట్‌ బ్లాక్‌లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో ఎలివేటర్‌లో సమస్య తలెత్తి ఒక్కసారిగా ఆగిపోయింది. లిఫ్ట్‌ బలంగా ఊగడంతో రవీంద్రన్‌ ఫోన్‌ కిందపడి పగిలింది. దీంతో తాను చిక్కుకుపోయినట్లు ఎవరికీ చెప్పే అవకాశం లేకుండాపోయింది.

లోపలి నుంచి సాయం కోసం అరిచినా ఎవరికీ వినబడకపోవడంతో అతడు ఇరుక్కుపోయిన సంగతి తెలియరాలేదు. సోమవారం ఉదయమే లిఫ్ట్‌లో ఓ మనిషి చిక్కుకుపోయాడని గుర్తించడం గమనార్హం. ఈ ఉదయం లిఫ్ట్‌ ఆపరేటర్‌ రొటీన్‌ వర్క్‌ కోసం ఆసుపత్రికి వచ్చారు. అప్పుడు అది పనిచేయడం లేదని గుర్తించి రిపేర్‌ చేసి లిఫ్ట్‌ డోర్‌ తెరవగా అందులో రవీంద్రన్‌ స్పృహతప్పి కన్పించాడు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

లిఫ్ట్‌ పని చేయని విషయాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది గుర్తించలేదని సమాచారం. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రవీంద్రన్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాత్రి ఆయన కుటుంబం మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.