తెలంగాణ రాజ్ భవన్ లో నా ఖర్చు నేను చెల్లిస్తున్నా.. తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: సాధారణ

జీవితం గడపడమే తన నైజమని, తెలంగాణ రాజ్ భవన్ లో తనకు అయ్యే ఖర్చును నెలనెలా తానే చెల్లిస్తున్నానని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.

తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లపాటు అందించిన సేవలు తనకు ఎదురైన అనుభవాలతో తమిళిసై రాసిన ‘రీ డిస్కవరింగ్ సెల్ప్ ఇన్ సెల్ఫ్ లెస్ సర్వీస్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం చెన్నైలో జరిగింది. ఈ పుస్తకాన్ని స్వయంగా ఆవిష్కరించిన తమిళిసై.సీనియర్ పాత్రికేయులు నక్కీరన్ గోపాల్, కృష్ణన్ తదితరులకు తొలి ప్రతిని అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గవర్నర్ హోదాలో ప్రత్యేక హెలికాప్టర్, ప్రత్యేక విమానం సేవలు పొందే అధికారం ఉన్నా.. తాను ఎప్పుడూ వాటిని వినియోగించలేదని అన్నారు. తెలంగాణలో తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని రాజ్యాంగ సంరక్షకురాలిగా తన బాధ్యతలను మాత్రం నెరవేరుస్తానని తెలిపారు. కానీ కొందరు తమ పనులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు వ్యతిరేకించినా తాను చేయదలచుకున్న పని ఆగదని స్పష్టం చేశారు.

తనకు ప్రజాశేయస్సే ముఖ్యమని, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని పేర్కొంటూ భద్రాచలంలో జరిగిన ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు వరదల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు భద్రాచలం వెళుతున్నానని మీడియా ద్వారా తెలుసుకుని.. అప్పటివరకు ఏ మాత్రం పట్టించుకోకుండా బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రి హడావుడిగా బాధిత ప్రాంతాలకు బయలుదేరారని అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా.. ఎక్కడున్నా.. ప్రజలతో మమేకం అవడమే తనకు ఇష్టమని వారి కష్టసుఖాలు పంచుకుంటూ సాధారణ మహిళగానే జీవిస్తానని చెప్పారు. తనకు చేతనైన సేవ చేస్తున్నానని దీనిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.