లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లంపీస్కిన్ వైరస్ పశువులకు సోకుతుండడంతో వాటి పాలు తాగడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి సోకిన పశువుల పాలు తాగితే మనుషులకూ వ్యాధి సంక్రమిస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దద్దుర్లు, బొబ్బలతో బాధపడుతున్నవారి ఫొటోలు ఇలాంటి పోస్టులకు జత చేసి ప్రజలను భయపెడుతున్నారు. ‘పాడి పరిశ్రమకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులలో ఇలాంటి పోస్టులను చాలా చూశాను నేను. ఇవి సర్క్యులేట్ చేస్తున్నవారికి దీంతో ఎలాంటి సంబంధం ఉండదు, తమకు చేరిన పోస్టులను వారు వచ్చింది వచ్చినట్లుగా షేర్ చేస్తారంతే” అన్నారు హరియాణాలో 6 వేల మంది పాడి రైతులు ఉన్న ఓ సంఘం జనరల్ సెక్రటరీ పోరస్ మెహ్లా. బీబీసీతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల పాడి రైతులు నష్టపోతున్నారన్నారు.

రాజస్థాన్‌కు చెందిన పాడి రైతు మానవ్ వ్యాస్ మాట్లాడుతూ.. ”ఇలాంటి ప్రచారం నేనూ చూశాను. ఇదంతా నమ్మి కొందరు పాలను పారబోస్తున్నారనీ తెలిసింది” అని చెప్పారు. ”ఇప్పటికే లంపీ స్కిన్ వ్యాధి కారణంగా పశువులను పోగొట్టుకుని రైతులు నష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు అనవసర భయాలతో ప్రజలు పాలను కొనడం మానేస్తే పాడిరైతుల కష్టాలు మరింత పెరుగుతాయి” అన్నారాయన. ‘లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా?’ అని గూగుల్‌లో వెతికేవారి సంఖ్య గత 30 రోజుల్లో 5,000 శాతం పెరిగిందని గూగుల్ ట్రెండ్స్ గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి లంపీ స్కిన్ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకే రకం కాదు.

లంపీ స్కిన్ వ్యాధి మనుషులపై ప్రభావం చూపదని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) 2017 నాటి తన నివేదికలో వెల్లడించింది. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా ఇదే విషయం చెబుతోంది. ‘ఇంతవరకు పశువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకిన ఉదంతం ఒక్కటి కూడా లేదు” అని ఈ ఇనిస్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ కేపీ సింగ్ ‘బీబీసీ’తో చెప్పారు. అయితే, ‘వ్యాధి సోకిన పశువు పాలను తాగితే దూడకు వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది’ అని చెప్పారాయన.

మనుషులకు లంపీ స్కిన్ వ్యాధి సోకినట్లుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న తప్పుడు పోస్టులపై కేపీ సింగ్ మాట్లాడుతూ శరీరంపై దద్దర్లు, పొక్కులు వంటి కొన్ని ఇతర చర్మ వ్యాధులలోనూ ఉంటాయని… ఇలా కనిపించినంతమాత్రాన అదంతా లంపీ స్కిన్ వ్యాధి కాదని.. ఇలాంటివి ఎవరికైనా చర్మంపై వస్తే ప్రయోగశాలలో పరీక్షిస్తే కారణమేంటనేది తెలుస్తుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.