తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మాట వాస్తవం

.. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం అంతకంతకూ తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికే జైకొడుతున్నాయి. కాగా ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానులు అంటోంది.మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ సభలు గర్జనలు ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖలో గర్జన నిర్వహించింది. తామొక్కరిమే మూడు రాజధానుల కోసం పట్టుబడుతున్నామనే అభిప్రాయం తలెత్తకుండా నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో విద్యార్థులను అధ్యాపకులను ఉద్యోగులను ఇందులో మిళితం చేస్తోంది.ఇప్పటికే విశాఖలో గర్జన నిర్వహించగా ఇప్పుడు తిరుపతిలో నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేశారు.ఇక కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం మూడు రాజధానులను మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీఎం వైఎస్ జగన్ కు  చెప్పినట్టు.. ఆయన వారించినట్టు వార్తలు వచ్చాయి.
ఇది నిజమేనని తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే సీఎం జగన్ వద్దన్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరి మనసులో విశాఖపట్నం రాజధాని అంశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ విశాఖపట్నం రాజధానిగా ఉండాలని గొంతు విప్పి మాట్లాడాలని పిలుపునిచ్చారు.
విశాఖ రాజధాని అంశంలో రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.. మంత్రి పదవికి తాను రిజైన్ చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దని చెప్పారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున రాజీనామా అవసరం లేదని సీఎం జగన్ చెప్పారని ధర్మాన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.