పార్టీ మారినంత మాత్రాన పట్టం కడతామా…?

.. మునుగోడు ఓటర్ల మనోగతం .. తెలంగాణ జ్యోతి గ్రౌండ్ రిపోర్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/మునుగోడు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది. గడచిన రెండు రోజులు గా తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ బృందం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, చండూరు, గట్టుప్పల్, మర్రిగూడెం తదితర ప్రాంతాలలో ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు తెలంగాణ వెబ్ న్యూస్ ప్రతినిధితో తమ మనోగతాన్ని పంచుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన గెలుపు గురించి తెలంగాణ జ్యోతి ప్రతినిధి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అనేకమంది ఓటర్ల మనోగతం ప్రకారం పార్టీ మారినంత మాత్రాన తాము పట్టం కడతామా? ఎంపీ, ఎమ్మెల్యేగా ఉండి తమ గ్రామాలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తామెందుకు మళ్లీ ఓటేస్తామని ఓటర్లు ఎదురు ప్రశ్నించడం ఆసక్తిగా మారింది. బుధవారం రాత్రి తెలంగాణ బిజెపి ఆగ్ర నాయకులతో కలసి బిజెపి మేనిఫెస్టోను ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎంపి గా ఐదు సంవత్సరాలు, ఎమ్మెల్యేగా మూడున్నర సంవత్సరాలు పనిచేసిన రాజగోపాల్ రెడ్డి సంవత్సర కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుండి ఏం నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారంటూ ఓటర్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై కూడా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటింగ్ కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల పనితీరు ఇదేవిధంగా ఉండడంతో ఓటు ఎవరికి వేయాలో తెలియక ఓటర్లు డైలమాలో పడుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ప్రధాన పార్టీలు చేయబోయే ప్రచారంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.