మహాత్మాగాంధీపై ఏపి ఎస్సీ కమిషన్ చైర్మన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహాత్మాగాంధీపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్గా మారడంతో ప్రతిపక్షాలు ఆయనతో రాజీనామా చేయించాలని సీఎం జగన్పై మండిపడుతున్నాయి.కాగా విక్టర్ ప్రసాద్ కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం రాజులపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘గాంధీని మీరంతా మహాత్ముడని అంటే.. నేను దుర్మార్గుడు నీచుడు అంటాను’ అని విక్టర్ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.’దేశంలో ఓటుహక్కు ఎవరికి ఇవ్వాలనే విషయమై 1932లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు గాంధీ అనే దుర్మార్గుడు.. ఈ దేశంలో బ్రాహ్మణులు వైశ్యులు రాజులతోపాటు ఒకటి రెండు కులాలకు తప్ప మిగిలిన కులాలకు ఓటుహక్కు అసలు వద్దన్నారు. ఆడవారు ఏ కులంలో పుట్టినా వారికి ఓటుహక్కు విద్య వద్దన్నారు. వారు ఉద్యోగం చేయడానికీ పనికిరారన్నారు. మహిళలకు ఆస్తిహక్కు వద్దన్నారు. అసలు బయటకు రావడానికే వీల్లేదన్నారు’ అని విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ను పదవి నుంచి తొలగించి.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి టీడీపీ నేత కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీని విమర్శించే విక్టర్ లాంటి దేశద్రోహుల్ని పదవుల్లో ఎలా కొనసాగిస్తారని జవహర్ ప్రశ్నించారు. ఇవాళ గాంధీని విమర్శించిన వ్యక్తి.. రేపు అంబేడ్కర్నూ అవమానిస్తారన్నారు. అలాంటివారినే జగన్ పాలు పోసి పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విక్టర్ ప్రసాద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు పోరాడిన గాంధీ.. దళిత వ్యతిరేకి ఎలా అవుతారని నిలదీశారు.కాగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్న విక్టర్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్త కాదని అంటున్నారు. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టగానే తాను ఎవరినీ లెక్కచేయబోనని.. కలెక్టర్లకు అయినా శిక్షలు విధిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పుడు ఏకంగా మహాత్మాగాంధీనే లక్ష్యంగా చేసుకోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.