మునుగోడు మాజీ ఎన్నికల అధికారిపై వేటు

.. తక్షణ సస్పెన్షన్‌కు ఆదేశాలిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథరావును సస్పెండ్‌ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. భద్రత కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా లేని అధికారాన్ని వినియోగించి మునుగోడులో ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తును జగన్నాథరావు మార్చటం నాడు వివాదమైంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. విచారణ నిర్వహించి పంపిన నివేదిక మేరకు ఎన్నికల బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పించి వెంటనే అప్పట్లో మరో అధికారిని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. ‘‘తక్షణం ఆయన సస్పెన్షన్‌ అమలులోకి వస్తుంది. ఆ ఉత్తర్వులను జారీ చేసి శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా దిల్లీ పంపాలి. ఎన్నికల అధికారికి తగినంత భద్రత కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత డీఎస్పీని బాధ్యుడిని చేయండి. ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సూక్ష్మ పరిశీలకుల నియామకం

పోలింగు సందర్భంగా అన్ని పోలింగు కేంద్రాల వద్ద సూక్ష్మ పరిశీలకులను(మైక్రో అబ్జర్వర్స్‌ను) నియమించాలని జిల్లా ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేసినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు. ‘‘ఎన్నికల నియమావళిని, వ్యయ నిబంధనలను అతిక్రమించినా, రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడినా సీవిజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు వచ్చిన వంద నిముషాల్లో అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుని చర్యలు తీసుకుంటారు. 739 పోస్టల్‌ బ్యాలెట్లకుగాను గురువారం వరకు 624 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన 21 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. రూ.2.95 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ శాఖ ఇప్పటి వరకు 123 కేసులు నమోదు చేసింది’’ అని వికాస్‌రాజ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.