12 యేండ్ల తర్వాత పలికిన గొంతు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏడేళ్ల ఆ  చిన్నారి గలగల మాట్లాడేది. కానీ ఏమైందో తెలియదు. ఒక్కసారిగా ఆమె గొంతు మూగపోయింది.   ఆనాటి నుంచి వారి  ఆర్థిక స్తోమతకు మించి వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా ఎలాంటి ఫలితం రాలేదు. తమ బిడ్డకు ఇక మాటలు రావని తల్లిదండ్రులు భావించారు. సైగలతోనే కూతురితో మాట్లాడేవారు. కానీ  సడన్‌గా 12 ఏళ్ల తర్వాత ఆ గొంతు మళ్ళీ పలికింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తమ బిడ్డ మాట్లాడుతుండడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.  ఇది వైద్య చరిత్రలో అరుదైన ఘటనగా వైద్యులు చెబుతున్నారు. నిజామాబాద్జి జిల్లా భీంగ‌ల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన ఈ యువతి పేరు సుజాత. వయసు 19 సంవత్సరాలు. ఏడేళ్ల వయస్సులో ఈమె గొంతు మూగ‌బోయింది. నోటి నుంచి మాట రాకుడా పోయింది. అప్ప‌టి వ‌ర‌కు  చక్కగా మాట్లాడే సుజాత చదువులోనూ ముందుండేది. ఒక్క సారిగా గొంతు మూగబోయి మాటలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనేక మంది డాక్టర్లకు చూపించి..  మందులు వాడినా సుజాతకు మాట రాలేదు. మూగ  అమ్మాయిగానే స్కూల్కి వెళ్లి టెన్త్, ఇంటర్ పూర్తి చేసింది. సుజాత జీవితాంతం మాటలు రావని త‌ల్లి దండ్రులు ఆనుకున్నారు. వారి ఆర్థిక స్తోమ‌త అంతంత మాత్రంగానే ఉంది. ముగ్గురు ఆడపిల్లల్లో సుజాత చిన్నది. ఐతే 12 ఏళ్ల తర్వాత సుజాతకు మాటలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

”12 సంవత్సరాల క్రితం మా చిన్నాన్న చనిపోయారు. ఆ  విషయాన్ని  ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అప్పుడు తాను వెక్కి వెక్కి ఏడస్తుంటే సుజాత వచ్చి నాపై పడింది. ఏమైందో ఏమో నాటి నుంచి సుజాత  గొంతు మూగ‌బోయింది. ఎంతో మంది వైద్యుల‌ను సంప్ర‌దించాము కానీ ఫ‌లితం రాలేదు. ఇప్పుడు మళ్లీ మాటలు రావడం సంతోషంగా ఉంది.”  అని సుజాత తల్లి పేర్కొన్నారు. నేను ఎంత ప్ర‌య‌త్నించిన మాట వచ్చేది కాదు. తోటి విద్యార్థులు తనను చూసి మూగది అని చెబుతుంటే బాధపడేదాన్ని. 12 సంవ‌త్స‌రాల త‌రువాత నా గొంతు లోంచి మాటలు రావడంతో  ఓ ప‌క్క ఆనందంగా ఉంది. మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంగా ఉంది.  నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకొని మంచి జాబ్ చేయాలని ఉండేది. కానీ చ‌దువు మ‌ద్య‌లోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ చదుకోవాలని అనుకుంటున్నాఅని సుజాత తన మనసులోని మాటను తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.