కఠిన చర్యలకు కేంద్రం సిద్ధం

.. ఎథిక్స్ కోడ్ కు త్వరలో సవరణలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఫేస్‌బుక్‌ ప్రొఫెల్‌ ఫొటోలు పోర్న్‌ సైట్‌లో ప్రత్యక్షం’.. ‘పోలీసు అధికారి ఫేక్‌ ప్రొఫైల్‌తో.. డబ్బులు కొల్లగొడుతున్న సైబర్‌ కేటుగాళ్లు’.. ‘మత విద్వేశాలను రెచ్చగొట్టేలా యూట్యూబ్‌లో వీడియో.. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు’.. నిత్యం పత్రికల్లో కనిపించే కథనాలివి..! పౌరుల వ్యక్తిగత భద్రత, దేశ రక్షణ, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా వైరల్‌ అవుతున్న పోస్టులు, వీడియోల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. గత ఏడాది జారీ చేసిన ‘సోషల్‌ మీడియా మార్గదర్శకాలు.. ఎథిక్స్‌ కోడ్‌-2021’కు సవరణలు చేసి, మరింత పదును పెడతామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్స్‌తో పనిచేసే వెబ్‌సైట్లు, ఓటీటీ ప్లాట్‌పారాలు వారి యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, నిర్ణీతకాలంలో పరిష్కరించడానికి మధ్యవర్తిత్వంగా ఫిర్యాదుల స్వీకరణ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘ఈ నిబంధనను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

లక్షల్లో ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అందుకే నిబంధనలను సవరించి, గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ(జీఏసీ)లను నియమించాలని నిర్ణయించాం. ఆయా సంస్థల వద్ద న్యాయం జరగని/ఫిర్యాదులకు పరిష్కారం లభించని వినియోగదారులు జీఏసీలను ఆశ్రయించవచ్చు’’ అని ఆయన వివరించారు. ‘‘చాలా సంస్థలు ఫిర్యాదులను రోజుల తరబడి పెండింగ్‌గా చూపిస్తున్నాయి. జీఏసీలు వస్తే ఈ పరిస్థితులు ఉండవు. జీఏసీ నిర్ణయాలు ఆయా సంస్థలకు వ్యతిరేకంగా ఉంటే.. అవి కోర్టులను ఆశ్రయించొచ్చు’’ అని ఆయన వివరించారు. గత ఏడాది విడుదల చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏదైనా కంటెంట్‌, వీడియో, లింకు, ఫేక్‌ ప్రొఫైల్స్‌, ఫేక్‌న్యూ్‌సను తొలగించాలని ఆదేశిస్తే.. 72 గంటల్లో చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఉంది. అయితే.. ఈ గడువు చాలా ఎక్కువ అని, ఆలోగా తప్పుడు సమాచారం వేగంగా విస్తరించే ప్రమాదముందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గడువును చాలా వరకు త్గగస్తామన్నారు.

వినియోగదారులు ఇలా ఫిర్యాదు చేయొచ్చు

సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లు, ఓటీటీలు, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫారాలు ఇప్పటికే మధ్యవర్తిత్వ అప్పిలేట్‌ అథారిటీలను నియమించుకున్నాయి. ఆ వివరాలను వాటి వెబ్‌సైట్లలో పొందుపరిచాయి. యూజర్లు/వినియోగదారులు తమ అభ్యంతరాలను, ఫిర్యాదులను ఆయా సంస్థల మధ్యవర్తిత్వ అప్పిలేట్‌ అథారిటీలకు లిఖితపూర్వకంగా, ఈ-మెయిల్‌ రూపంలో అందజేయవచ్చు. 30 రోజుల్లోగా వాటిని ఆయా సంస్థలు పరిష్కరించాలి. ఒకవేళ అలా జరగకున్నా.. తమకు న్యాయం జరగలేదని వినియోగదారులు భావించినా.. జీఏసీలకు అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఏయే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు?

యూజర్లకు నేరుగా నష్టం కలిగించే(వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత వివరాల తస్కరణ) పోస్టులు.. మార్ఫింగ్‌ చేసి, అశ్లీలంగా పోస్టు చేసే ఫొటోలు, వీడియోలు.. చిన్నారులకు నష్టం అనుకునే అంశాలు.. చైల్డ్‌పోర్నోగ్రఫీ, పోర్నోగ్రఫీ, ప్రజాజీవనానికి భంగం కలిగించే అంశాలు.. నేరపూరితమైన పోస్టులు, పోలీసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించే పోస్టులు.. ఇతర దేశాలను కించపరిచేలా చేసే పోస్టులు, వీడియోలపై ఫిర్యాదులు చేయొచ్చు. ఇంకా.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14(చట్టం ముందు అంతా సమానులే), 19(భావ ప్రకటన స్వేచ్ఛ), 21(జీవించే హక్కు)లకు భంగం వాటిల్లే పోస్టులు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసే పోస్టింగ్‌లు, వీడియోలపైనా యూజర్లు ఫిర్యాదు చేయవచ్చు. సోషల్‌ మీడియానే కాకుండా.. ఓటీటీ, యాప్‌లు, న్యూస్‌ పోర్టర్లు, న్యూస్‌ అగ్రిగేటర్‌ వెబ్‌సైట్లలో పై అంవాలకు విరుద్ధంగా వచ్చే కంటెంట్‌పైనా ఫిర్యాదు చేయవచ్చు.. కేపీ

Leave A Reply

Your email address will not be published.