6 ఏండ్ల చిన్నారి పై అఘాయిత్యం..బాలిక మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక శరీరంపై గాయాలు చేశాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన కొందరు వలస కూలీలు వ్యవసాయ పనుల కోసం కొన్ని రోజుల క్రితం డిచ్‌పల్లి మండలంలోని ఓ గ్రామానికి వచ్చి.. అక్కడే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ మహిళకు భర్త లేకపోవడంతో గోవింద్‌ రావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెకు అప్పటికే ఆరేళ్ల వయస్సున్న కూతురు ఉంది. బాలికపై గోవింద్‌ రావు కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి ఈ నెల 20వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక శరీరంపై గాయాలు చేశాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ వెంటనే నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కాసేపటికి వచ్చిన బాలిక తల్లి.. చిన్నారిని నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలిక పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

అయితే ఈ విషయం పోలీసులకు తెలిస్తే అసలు విషయం బయటపడుతుందని బాలిక తల్లిని గోవింద్‌రావు ఏమార్చాడు. పోలీసు కంప్లైంట్‌ చేస్తే పోస్టుమార్టం చేస్తారని, నార్మల్‌ డెత్‌ అని చెప్పి బాలిక మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే విషయమై అప్పటికే డిచ్‌పల్లి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందిందని తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇదే సెక్షన్ కింద మొదట కేసు నమోదు చేశారు.

పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. వైద్యులు బాలిక ఒంటిపై ఉన్న గాయాలను చూసి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈనెల 26న డిచ్‌పల్లి పోలీసులకు పోస్టుమార్టం రిపోర్టును సమర్పించారు. దీన్ని చూసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తల్లిని ప్రశ్నించారు. అనంతరం గోవిందరావుని విచారించగా తానే అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసులో అత్యాచారం, హత్యతో పాటు పోక్సో సెక్షన్ జోడించామని నిందితుడిని త్వరలోనే రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.