కాణిపాకం లో వరుస వివాదాలు

.. దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో నెల రోజులుగా వరుస వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. భక్తిశ్రద్ధలతో పాల్గొనే పంచామృతాభిషేకం టికెట్‌ ధరను అప్పటి ఈవో ఎంవీ సురేశ్‌బాబు రూ.700 నుంచి ఒక్కసారిగా రూ.5 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసు ఇచ్చారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి రావడమే కాక.. ఈవోను బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. ఘటన ఈ నెల ఆరో తేదీ జరిగింది. దీన్ని భక్తులు మరవక ముందే రెండ్రోజుల క్రితం మరో సంఘటన వెలుగుచూసింది. స్వామివారి ప్రధాన ఆలయ మహాకుంభాభిషేకం రోజున వేలూరు బంగారు గుడి పీఠాధిపతి నారాయణి అమ్మన్‌ రూ.18 లక్షల విలువైన రంగురాళ్లు పొదిగిన విబూది పట్టిని ఆగస్టు 21న ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్‌ గురుకుల్‌కు అందించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయకుండా ఆయన తన వద్దనే ఉంచుకున్నాడు. రసీదు కోసం బంగారు గుడి ఆలయాధికారులు సంప్రదించినపుడు కానుక విషయం వెలుగు చూసింది. దీనిపై పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి విచారణలో అది ఉప ప్రధాన అర్చకుడి వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీన్ని స్వాధీనం చేసుకుని వారికి రసీదు ఇచ్చారు. ఇదే క్రమంలో ఉప ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్‌ గురుకుల్‌ను సస్పెండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.