నంబరు ప్లేటు లేని వాహనాలపై క్రిమినల్‌ కేసులు

.. పోలీసులు స్వాధీనం చేసుకున్న నంబరు ప్లేటు లేని కారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌: ట్రాఫిక్‌ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లకు నంబర్‌ప్లేట్లు తొలగిస్తున్నారు. పట్టుబడమనే ధీమాతో యథేచ్ఛగా రహదారులపై చక్కర్లు కొడుతున్నారు. ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు పెంచారు. నంబరు ప్లేటు లేకపోయినా, అంకెలు చెరిపేసినా చీటింగ్‌ కేసు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. దీంతో వాహన యజమానులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే నిర్దేశించినట్టు నంబరు ప్లేటును వాహనాలకు అమర్చుకోవాలని సూచిస్తున్నారు. అధికశాతం యువతే.. చిరుద్యోగులు, డెలివరీబాయ్స్‌, విద్యార్థులు అధికశాతం ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తున్నారు. పోలీసుల తనిఖీలు, జరిమానాలకు భయపడి తప్పించుకునేందుకు నంబరు ప్లేట్లు తొలగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కొందరు కనిపించకుండా మాస్క్‌లు, చేతిరుమాళ్లు చుడుతున్నారు. మరికొందరు నాలుగు అంకెల్లో ఒకదాన్ని తీసేయటం/అడ్డుగా ప్లాస్టర్‌ అంటించటం చేస్తున్నారు. ఆపరేషన్‌ రోప్‌ చేపట్టాక ట్రాఫిక్‌ పోలీసులు నంబరు ప్లేటు లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేశారు. యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. చలానాల నుంచి బయట పడేందుకు చేసే తప్పిదంతో క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కోవద్దంటున్నారు.

ప్రమాదం జరిగితే ఇబ్బంది.. చోరీలకు వినియోగం
కొద్దిరోజుల క్రితం ముషీరాబాద్‌ సమీపంలో రహదారి ప్రమాదం జరిగింది. వాహన నంబరు సరిగా లేకపోవటంతో క్షతగాత్రుడి ఆచూకీ గుర్తించేందుకు చాలా సమయం పట్టిందంటూ ఓ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి వద్ద పోలీసులను గమనించిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనం అక్కడే నిలిపేసి పారిపోయాడు. మాదాపూర్‌లో చోరీ చేసిన ఆ వాహనాన్ని నంబరు ప్లేటు తొలగించి వాడుతున్నట్టు గుర్తించారు. గతంలోనూ గొలుసుచోరీలకు పాల్పడిన నిందితులు ముందుగా ఏదోచోట ద్విచక్రవాహనాలను చోరీ చేసేవారు. వాటికి నంబరు ప్లేట్లు తొలగించి వరుస చోరీలతో పోలీసులకే సవాల్‌ విసిరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన కూడళ్లు, దేవాలయాల వద్ద పోలీసు గస్తీ పెంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.