పోటెత్తిన ఓటర్లు.. మునుగోడులో భారీగా పోలింగ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడులో ఎన్నికల ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. ఇప్పుడు పోలింగ్ కూడా అంతకు మంచి స్థాయిలో జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుఝామున పెద్దగా క్యూలైన్‌లు కనిపించకపోయినా.. ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి. బూత్‌ల ముందు భారీ క్యూలైన్‌లు కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటల వరకు 25.8శాతం పోలింగ్ నమోదయినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వరకు ఇది మరింతగా పుంజుకుంటుందని.. ఈసారి గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ 91.30 శాతం పోలింగ్ నమోదయింది. ఇప్పుడు అంతకంటే ఎక్కవే నమోదు కావచ్చన్న అంచనాలున్నాయి.

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నారాయణపురం మండలంలోని లింగవారిగూడెంలో ఓటు వేశారు. సతీసమేతంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి చండూరు మండలం ఇడికూడలో ఓటు వేశారు. 173 పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మండలంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కేఏ పాల్ ఇక్కడ ఓటు హక్కులేదు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. పలు పోలింగ్‌కు కేంద్రాలను సందర్శించి.. ఓటింగ్ సరళిని తెలుసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.