గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.  మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి.  4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు  ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా షిప్పింగ్ కంటైనర్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బారుచ్  జిల్లా అలియాబెట్‌లో ఉన్న 217 మంది ఓటర్ల కోసం ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరు ఓటు వేయాలంటే దాదాపు 82 కి.మీ. ప్రయాణించాల్సి ఉండేది. కానీ ఇప్పుడా ఇబ్బందులు ఉండవు. ఇక గిర్ సోమనాథ్ జిల్లాలోని మాదాపూర్ జంబూర్‌లో సిద్దీల కోసం 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు 14-17వ శతాబ్ధం మధ్య కాలంలో తూర్పు ఆఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చారు. గుజరాత్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ , కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. మేం కూడా పోటీల్లో ఉన్నామంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది.  ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆమాద్మీ మధ్య ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.