మునుగోడులో 300 కోట్ల మేరు మద్యం అమ్మకాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. ముందు నుంచే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెద్దఎత్తున సాగుతుండగా.. ఇటీవల ఆ అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఫలితంగా తెలంగాణ ఖజానాకు ఎక్సైజ్ శాఖ భారీగా కాసులు కురిపిస్తోంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక కూడా బాగానే కలిసొచ్చింది. సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాల ద్వారా రూ.2700 కోట్లు సమకూరితే.. అక్టోబర్ నెలలో ఈ అమ్మకాలు ఏకంగా రూ.3037 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కేవలం మునుగోడులోనే రూ. 300 కోట్ల మేరు మద్యం అమ్మకాలు జరగటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ఉపఎన్నికల వేళ మునుగోడులో మద్యం పంపిణీ జోరుగా సాగినట్టు తెలుస్తోంది. అబ్కారీ శాఖ లెక్కల ప్రకారం అక్టోబర్ 22వ తేదీ వరకే మునుగోడులో రూ.160.8 కోట్ల విలువ చేసే మద్యం అమ్ముడైంది. మిగతా అమ్మకాలు మొత్తం మిగిలిన ఎనిమిది పది రోజుల్లోనే జరిగినట్టు సమాచారం. నల్లొండ జిల్లా మొత్తం మీద ప్రతి నెలా సుమారు రూ.132 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే.. ఈ ఉపఎన్నిక వల్ల.. కేవలం మునుగోడులోనే ఏకంగా రూ.300 కోట్ల మేర అమ్మకాలు జరగటం విశేషం. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. దీంట్లో భాగంగానే.. పెద్దఎత్తున నగదు, మద్యం పంపిణీ జరిగింది. ప్రచార సమయంలో పలు చోట్ల ఆయా పార్టీలు బహిరంగంగానే మద్యం బాటిళ్లను పంపిణీ చేశాయి. ఆయా మండలాల్లో ఏకంగా వైన్ షాపులనే లీజుకు తీసుకుని మరీ.. రాజకీయ పార్టీలు మద్యం పంపిణీకి తెరలేపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ప్రచారం ముగిసిన తర్వాత.. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఖాళీ బాటిళ్లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయంటూ.. ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు కూడా చేశాయి. మొత్తంగా చూస్తే.. మునుగోడు ఉపఎన్నిక ఎక్సైజ్ శాఖకు భారీగా కాసులు కురిపించింది.

Leave A Reply

Your email address will not be published.