చచ్చిన దోమలను కోర్టుకు తీసుకెళ్లిన గ్యాంగ్‌స్టర్.. కారణం తెలిస్తే విస్తుపోవాల్సిందే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఓ గ్యాంగ్‌స్టర్ చచ్చిన దోమలను కోర్టుకు తీసుకెళ్లాడు. కారణం తెలిస్తే.. ఎవరైనా విస్తుపోవాల్సిందే. వాటిని చూపించి.. జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని కోర్టుకు తెలియజేశాడు. పైగా దోమ తెర ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ పని చేసినది గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు ఎజాజ్ లక్డావాలా. ఎజాజ్‌పై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 జనవరిలో అరెస్టైన అతడు అప్పటి నుంచి నవీ ముంబై సమీపంలోని తలోజా జైల్లో ఉంటున్నాడు. అయితే లక్డావాలా.. ఇటీవల జైల్లోని దోమల సమస్యపై దరఖాస్తు చేసుకున్నాడు. జైలు గదిలో దోమల తెర వినియోగానికి అనుమతి ఇవ్వాలని విన్నవించుకున్నాడు. అందులో భాగంగా గురువారం కోర్టు విచారణ సందర్భంగా చచ్చిన దోమలతో నిండిన ప్లాస్టిక్ సీసాను కోర్టుకు తీసుకెళ్లాడు. జడ్జ్‌కు దానిని చూపించి.. దోమల బెడద గురించి వివరించాడు. దోమల కారణంగా తనతోపాటు .. ఇతర ఖైదీలు కూడా ఇబ్బంది పడుతున్నారని, దోమల తెర వినియోగించేందుకు అనుమతించాలని లక్డావాలా కోరాడు. అంతేకాదు 2020లో తాను అరెస్టైనప్పుడు దోమల తెర వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు కోర్టుకు తెలియజేశాడు. అయితే ఈ ఏడాది మే నెలలో భ్రదతా కారణాలతో ఆ దోమ తెరను జైలు అధికారులు తీసేసుకున్నారని వెల్లడించాడు. అయితే లక్డావాలా అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. భద్రతా కారణాల రీత్యా అది అవ్వదని చెప్పింది. దానికి బదులు ఓడోమోస్ వంటి వాటిని ఉపయోగించవచ్చని సూచించింది. కాగా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద వివిధ కేసుల్లో లక్డావాలా దోషిగా ఉన్నాడు. మహారాష్ట్రలో అతనిపై ఉన్న 27 ప్రధాన కేసుల్లో 25 ముంబైలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆ జైల్లోని ఇతర ఖైదీలు కూడా దోమల తెర కోసం కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే కొందరు ఖైదీలకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మరికొందరికి తిరస్కరించింది. అదే సమయంలో జైల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.