ప్రమాదం సంభవిస్తే బాధ్యులు ఎవరు?

.. విద్యార్థులతో అన్ని పనులు .. చోద్యం చూస్తున్న ఉపాద్యాయులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కామారెడ్డి ప్రతినిధి: నిరుపేదలు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించి ప్రయోజకులను చేద్దామన్న సదుద్దేశంతో తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తుండగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.

అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా కొంతమంది ఏమి పట్టించుకోకుండా విద్యార్థుల తోటే పనులు చేయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చోటుచేసుకుంది. కొంత మంది విద్యార్థులు కట్టెల పొయ్యి దగ్గర అన్నం కలుపుతూ కనిపించారు. పెద్ద పెద్ద ఆండాలలో వేడి వేడి అన్నాన్ని దించుతూ తోటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. నెమ్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సుమారుగా 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించేందుకు వంటమనిషి తో పాటు మరో ముగ్గురు హెల్పర్లు ఉన్నప్పటికీ ప్రతిరోజు విద్యార్థుల తోటే పనులు చేపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ ప్రతినిధి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణను వివరణ కోరగా 600 మంది విద్యార్థులు తమ పాఠశాలలో చదువుతున్నారని, వారిలో కొంతమంది విద్యార్థులు వడ్డన మాత్రం చేస్తారని అన్నారు. విద్యార్థులు కట్టెల పొయ్యి వైపు వెళ్లారు అని సమాధానమిచ్చారు. విద్యార్థులే వంట చేస్తున్న ఘటన గురించి మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావును వివరణ కోరగా విద్యార్థులతో వడ్డించడం కూడా తప్పేనని అన్నారు. విద్యార్థులే వంట చేస్తున్న ఫోటోలు తాను చూశానని దీనిపై వివరణ తీసుకుంటామని అన్నారు. ఏది ఏమైనా పాఠశాలలో విద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులతో ఆహార పదార్థాలను తోటి విద్యార్థులకు వడ్డించడం వంటి ఘటనల పై జిల్లా విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని ఇకపై పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.