ప్రమాదం లో శ్రీ లంక బోటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీలంక నుంచి 306 మంది ప్రయాణికులు పడవలో వేరే దేశాలకు వెళ్లడానికి బయలుదేరారు.బోటు సామర్థ్యానికి మించి ఎక్కడం వాతావరణం అనుకూలించకపోవడంతో కుదుపులకు గురయిందని తెలుస్తోంది. ఈ ఘటనలో చాలా మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. వీరిలో 30 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. వాతావరణం అనుకూలించకపోవడంతో బోటు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా దెబ్బతిందని తెలుస్తోంది. సిగ్నల్స్ కట్ అయి కూడా ఏడు గంటలు దాటిపోయిందని తెలుస్తోంది. సిగ్నల్స్ ఉన్నప్పుడే తమిళనాడులోని తమ బంధువులకు ఫోన్ చేసి కాపాడాలని ఆర్తనాదాలు పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీలంక వాసులు ప్రయాణిస్తున్న బోట్ సురక్షితంగా ఉందా లేదంటే మునిగిపోయిందా అనేది సమాచారం తెలియడం లేదు.కోవిడ్ విజృంభణ పర్యాటక రంగం దెబ్బతినడం లెక్కకు మిక్కిలి చేసిన అప్పులు వడ్డీ భారం విపరీతంగా పెరిగిపోవడం తదితర కారణాలతో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సె దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. ప్రజలు పార్లమెంటును చుట్టుముట్టి భారీ నిరసనలకు దిగారు. గొటబాయ నివాసంలో విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో రణిల్ విక్రమ సింఘే దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఇలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రజలు ఇంకా దయనీయ పరిస్థితిలోనే భారత్తో సహా అనేక దేశాలు శ్రీలంకకు చేతనైన మేరా ఆర్థిక సాయం చేశాయి. అయినా ఆ దేశం కుదురుకోలేదు.దీంతో చేయడానికి పనిలేక ఉపాధి లేక ప్రజలు దేశం వదిలి వెళ్లిపోతున్నారు. తిండి కూడా దొరకడం లేదు. నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో శ్రీలంక దేశీయులు పడవల్లో సమీప దేశాలకు వలస పోతున్నారు. సముద్ర తీరం దాటి ఏ దేశం వస్తే ఆ దేశానికి పోదామని బయలుదేరిన శ్రీలంక వాసులు ఇప్పడు నడి సముద్రంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.ఏదో దేశం వెళ్లి పనిచేసుకుంటూ పొట్ట పోసుకుందామని పడవలో బయలుదేరిన శ్రీలంక వాసులు వియత్నాం ఫిలిప్పీన్స్ దేశాల మధ్య చిక్కుకున్నారు. దక్షిణ చైనా సముద్రంలో చిక్కుకుపోయిన వీరంతా తమను కాపాడాలని తమిళనాడులో ఉన్న తమ బంధువులకు ఫోన్ చేసి వేడుకున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.