సమాజ సుస్థిరాభివృద్ది కోసం సైన్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

మన రోజువారీ జీవితంలో సైన్స్  ( విజ్ఞాన శాస్త్రం )   కీలక పాత్ర పోషిస్తున్నది  . ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాలను ఒక క్రమపద్దతి ప్రకారం వివరించే వ్యవస్థీకృత శాస్త్రవిజ్ఞానమే సైన్స్  . ప్రముఖ గ్రీకు తత్వవేత్త మరియు జీవశాస్త్రవేత్త అరిస్టాటిల్ ప్రకారం  శాస్త్రీయ విజ్ఞానం అనేది తార్కికంగా , హేతుబద్దంగా వివరించగల విశ్వసనీయ విజ్ఞాన రంగం .  ఆధునిక ప్రపంచంలో సైన్స్  లేని జీవితాన్ని ఊహించడం కష్టం . మనిషికి కావలసిన ఆహారం , ఆరోగ్యం , విద్య , రక్షణ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవడంలో సైన్స్  గణనీయమైన ప్రగతి సాధించింది . సైన్స్  అంటే కేవలం ప్రకృతి సూత్రాల సమాహారమే కాదు , అది ఒక సత్యపథం , జీవనవిధానం ,  హేతుబద్దమైన ఆలోచనా ప్రక్రియ మరియు  సృజనాత్మక పరిష్కార మార్గం  .  టెక్నాలజీ అనేది నైపుణ్యం , సమన్వయము , సాధనల కలయిక . కనుక శాస్త్ర , సాంకేతిక విజ్ఞానం   మనకు  వస్తువులను , సౌకర్యాలను , భోగభాగ్యాలను , మానసికోల్లసాన్ని కల్పించటంతో పాటు సమాజనికి   హేతుబద్దమైన ఆలోచనను , క్రమశిక్షణను , విలువలను ,  ప్రశ్నించే  తాత్విక దృష్టిని ఇచ్చి , మానవ పురోభివృద్దికి , నవనాగరికతకు నాంది పలికింది . అయితే నేడు సైన్సును మనం  కేవలం ఒక వినియోగదారుడుగా మాత్రమే ఆలోచించి తమకు ఉపయోగపడే సాంకేతిక రంగానికే అధిక ప్రాధాన్యతనిస్తూ ఉపయోగవాదిగా వ్యవహరిస్తున్నాము . దీంతో సమాజంలో  శాస్త్ర విజ్ఞానం తగ్గి   ఛాందసవాదం ప్రబలుతున్నది , హేతువాదం కనుమరుగైపోతున్నది , మానవీయకోణం మరుగున పడుతోంది , వివేకము , వివేచన  మాయమైపోతున్నది . కనుక   మెరుగైన శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం శాంతిని , అభివృద్దిని కాంక్షిస్తూ యునెస్కో నిర్ణయం మేరకు 2002 సవత్సరం నుండి  ప్రతి సంవత్సరం నవంబర్ 10 న ప్రపంచ దేశాలన్నీ  “ ప్రపంచ సైన్సు దినోత్సవం  జరుపుకొంటున్నాయి . నాటి నుండి ప్రతి సంవత్సరం ఒక    విజ్ఞాన శాస్త్ర ప్రాధాన్య  నిర్దేశనముతో అన్నీ దేశాలు  సైన్సు దినమును జరుపుకొంటూ , ప్రజల్లో శాస్త్రీయ దృక్పధం పెంపుదలకు  కృషి చేస్తున్నాయి . గత సంవత్సరం ( 2021 ) లో “ శాంతి –అభివృద్ది కొరకు సైన్సు “ అనే ఇతివృత్తంతో నిర్వహించుకున్నాము . ఈ సంవత్సరం 2022 నవంబర్ 10న “ సుస్థిరాభివృద్ది కొరకు ప్రాధమిక శాస్త్రాలు “అనే నినాదంతో “ ప్రపంచ విజ్ఞానశాస్త్ర పండుగ “ ను జరుపుకొంటున్నాయి . మన దేశంలోనైతే  “ నా మతం సైన్సు…దానినే జీవితాంతం ఆరాధిస్తా “ అంటూ తన చివరి శ్వాస వరకు శాస్త్ర అన్వేషణలో గడిపిన సివి రామన్ “ రామన్ ఎఫెక్ట్ “ ఆవిష్కరించిన ఫిబ్రవరి 28న జాతీయ సైన్సు దినోత్సవంగా  జరుపుతాము   . 1  వైజ్ఞానిక రంగంలో ప్రయోగశాలలలో  జరుగుతున్న అనేక పరిశోధనల గురించి  సామాన్య జనాలకు తెలియజేసి వారిని సైన్స్ లిటరేట్స్ గా మార్చడం  2 శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ప్రాచుర్యాన్ని కలిగించడం 3  సైన్స్ ను సమాజ వికాసానికి తోడ్పడే విధంగా   దగ్గరగా తెసుకెళ్లటం మరియు  సమస్యల పరిష్కారాలను సూచించడం   అనేవి ప్రపంచ  సైన్సు దినోత్సవం  యొక్క ప్రధాన ఉద్ధేశ్యాలుగా ఉన్నవి  .

విజ్ఞానశాస్త్రంతోనే వికాసం

 మానవ పరిణామక్రమంలో నాటి పాతరాతి యుగం నుంచి నేటి నానో డిజిటల్ యుగం (వరకు జరిగిన శాస్త్ర , సాంకేతిక విప్లవంతో మానవాళి జీవనశైలిలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి . నాటి నుండే సైన్సు , మానవజాతి అభివృద్ది  రెండూ వేగంగా , జమిలిగా కొనసాగాయి . నిప్పు , చక్రం , భాణం లను కనుగొనడం  ,  పశువుల మచ్చిక , వ్యవసాయం , కాల్చిన ఇటుకలు , కుమ్మరిసారె , రాగి ,  ఐరన్ ను కనుగొనడం ,  దిక్సూచి ,  లిపి ,  సంఖ్యామానం తదితర ప్రధాన మౌలిక  ఆవిష్కరణలు జరిగాయి . సుమారు క్రీ.శ 200 సంవత్సరం నుండి  1400 సంవత్సరాల వరకు విజ్ఞానశాస్త్ర  ప్రగతిలో పెద్దగా ప్రగతి లేదు . ఈ మద్యయుగ  కాలాన్నే  “ విజ్ఞాన శాస్త్రపు చీకటి కాలం “అంటారు . అనంతరం   ఆధునిక కాలంలో 17 , 18 శతాబ్దాలను “ సైన్సులో  జ్ఞానోదయ యుగం  “ అంటారు . ఈ కాలంలోనే  కేవలం పరిశీలనలు , పరిశోధనల , ప్రయోగాలు  ద్వారా భౌతీక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మొదలవటంతో  అనూహ్యరీతిలో శాస్త్ర సాంకేతిక రంగాలు  వృద్ది చెందాయి  . తత్ఫలితంగా మానవుడి అవసరాలు , కోరికలు , సౌఖ్యాలు తీరడం మొదలైంది . ప్రధానంగా  19 వ శతాబ్దంలో   శాస్త్రీయ సమాజం , శాస్త్రీయ పరిశోధన , శాస్త్రీయ పద్దతి , శాస్త్రీయ దృక్పధం   అనే భావనలు రూపుదిద్దుకొని  భౌతిక రసాయన శాస్త్రాలు , జీవశాస్త్రాలు ప్రస్తుత రూపు సంతరించుకున్నాయి .  21వ శతాబ్దం అనేది సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు సంబందించిన శతాబ్దం . మానవ భౌతీకజీవనం సంపూర్తిగా శాస్త్రసాంకేతిక విజ్ఞానం పైనే ఆధారపడిన అపూర్వకాలం ఇది  . గ్రీన్ మరియు డిజిటల్ ఎకానమీ లకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిశోధనాత్మక సమాజాన్ని  అభివృద్ది పరచాలని  “ స్మార్ట్ అభివృద్ది కొరకు కాలానికి వ్యతిరేఖంగా పోటీ “ అనే టైటిల్ తో యునెస్కో తాజాగా  తన  వరల్డ్ సైన్స్ రిపోర్ట్-2021లో  పేర్కొంది . ప్రస్తుతం విశ్వావిర్భావం , బయోటెక్నాలజీ , బయో ఇన్ఫర్మాటిక్స్ , జెనటిక్ ఇంజనీరింగ్ , హ్యూమన్ జీనోమ్ థెరపీ , జీన్ ఎడిటింగ్ , స్టెమ్ సెల్ పరిశోధన , క్లోనింగ్ , చంద్రయాన్ ప్రాజెక్ట్ , నానోటెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ , ఫార్మాసూటికల్ పరిశోధన , ఆర్టిఫీషియల్ లైఫ్ , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , డేటా సైన్స్ , మెషీన్ లర్నింగ్ , రోబోటిక్స్ , వృద్దాప్యము , జననమరణ రహస్యం , గ్రహాంతర జీవుల అన్వేషణ ,నూతన జీవసృష్ఠి వంటి విషయాలపై విస్తృత పరికల్పనలు ,  పరిశోధనలు జరుగుతున్నాయి . ఈ పరిశోధనల అంతిమలక్ష్యం విశ్వాసాలతో పోరాటం కాదు , వాస్తవాలను ఆవిష్కరించడం అని గమనించాలి .

భారత దేశం మొదటి నుండి  శాస్త్ర , సాంకేతిక రంగాలలో ప్రపంచంతో పోటీ పడుతూనే ఉంది . శాస్త్ర సంపదకు నిష్ణాతులైన శాస్త్రవేత్తలకు మన దేశంలో కొదువ లేదు . శుశ్రుతుడు , చరకుడు , ఆర్యభట్ట , భాస్కరుడు , శ్రీనివాసరామానుజం , సివి రామన్ , జహంగీర్ బాబా , జెసి బోస్ , విక్రమ్ సారాబాయి  , హరగోవింద్ ఖోరాన , చంద్రశేఖర్ సుబ్రమణ్యం  , అబ్దుల్ కలామ్ వంటి ఎందరో  మహానుబాహువులైన శాస్త్రవేత్తలు  శాస్త్ర జ్ఞానాన్ని సుసంపన్నం చేశారు . స్వాతంత్ర్యం అనంతరం  మొదటిసారిగా భారత ప్రభుత్వం 1958 సంవత్సరంలో ఆ తర్వాత 1983 , 2003 , 2007 సంవత్సరాల్లో  జాతీయ సైన్సు విధానాలను ప్రకటించి సైన్సు విద్యను ప్రోత్సహించింది . 2013 వ  సంవత్సరంలో  లో “ సైన్సు-టెక్నాలజీ- ఇన్నోవేషన్ -2013 “ పాలసీని   ప్రవేశపెట్టి 2020 నాటికి శాస్త్ర సాంకేతిక రంగంలో  తొలి ఐదు దేశాల్లో ఒకటిగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది . ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన  శాస్త్రీయ పరిశోధనలు , నూతన ఆవిష్కరణలు , అత్యాధునిక సాంకేతికతా కార్యక్రమం “ సృష్టి  “  ద్వారా   భారత దేశంలో వేగవంతమైన సమ్మిళిత వృద్దితో పాటు సుస్థిరాభివృద్దిని సాధించ వచ్చని పేర్కొంది .    దేశ వ్యాప్తంగా డిజిటల్ లిటరసి సాధించే లక్ష్యంతో జాతీయ డిజిటల్ లిటరసి మిషన్-2014 లో భాగంగా “  డిజిటల్ సాక్షరతా అభియాన్ “ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టి ముందుకు సాగుతున్నది .  కోవిడ్-19 నేపధ్యంలో 2020 వ  సంవత్సరంలో “ సైన్స్-టెక్నాలజీ –ఇన్నోవేషన్ -2020 “  అను నూతన సైన్స్ పాలసీని కేంద్రం ప్రవేశపెట్టి ‘ ఆత్మనిర్భర్ భారత్ ‘ లో కీలకాంశాలైన సమ్మిళిత వృద్ది , సుస్థిర పర్యావరణం , ఆరోగ్యసంరక్షణల  కొరకు కృషి సల్పుతున్నది   . ప్రస్తుతం అమలవుతున్న  ఇన్స్పైర్, జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్సిబిషన్, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్వంటి ప్రోగ్రాములు  పిల్లలలో శాస్త్రీయ అవగాహన  పెంపొందించడానికి దోహదపడుచున్నవి . 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో    ఇంతటి నిరంతర  కృషితో   మనం ఈనాడు  హరిత విప్లవం , శ్వేత విప్లవం , నీలి విప్లవం , ఆహారపధకాల్లో  స్వయం సాధికారత సాధించడంలో ముందున్నాము.

    విజ్ఞాన శాస్త్ర ఫలాలను సమర్థవంతంగా వినియోగించగలిగితే అది సమాజనికి సమగ్ర సంపదను , మౌలిక సదుపాయాలను  సమకూర్చడమే కాకుండా జనజీవన ప్రమాణాలను కూడా  మెరుగుపరచి  సమాజాన్ని బలోపేతం చేస్తుంది . అయితే ఆధునిక యుగంలో  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం  నిర్మాణాత్మక కార్యకలాపాలకే కాకుండా విధ్వంసక ఆవిష్కరణ కార్యకలాపాలకు , అసాంఘిక కార్యకలాపాలకు  కారణభూతమవడం బాధాకరం . దీనికి కారణం మానవ మేధస్సుతో పాటు వివేకం , విజ్ఞత , మానవీయతలను జత చేయకపోవడమే . ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటీష్ తత్వవేత్త బెట్రండ్ రస్సెల్ అన్నట్లు… “ మానవుని విజ్ఞానంతో పాటు అతని వివేకం  కూడా పెరుగకపోతే ఆ విజ్ఞానం పెనువిషాదాన్నే పెంచుతుంది “ . అందుకే మనిషి తాను సృష్ఠించుకొన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానపు వలలో తానే పట్టుపురుగులా బందీ అయిపోయి  గత సమాజం కంటే ఈ అత్యాధునిక ప్రపంచంలోనే  అభద్రతను , అసంతృప్తిని , అసహనాన్ని అనుభవిస్తూ , సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుచున్నాడు .

సైన్సుతోనే సమస్యల పరిష్కారం

 ఆధునిక యుగంలో వాతావరణ ముప్పు , వైరల్ వ్యాధుల   విజృంభణ , జీవయుధాల తయారీ ,  డయాబెటిక్ వ్యక్తులు పెరుగుతుండడం  , అనైతిక దోపిడీకి గురవుతున్న అట్టడుగు వర్గాలలో సైన్స్ వ్యతిరేఖ వైఖరి మరియు  పురాతన శాస్త్ర భావజాలం ,   మూఢనమ్మకాలు  , జ్యోతిష్యం , భూతవైద్యం ,  మతనమ్మకాలు  లాంటి నిరూపణకు నిలబడని  కుహనా విజ్ఞానం ( సూడో సైన్స్ లేదా కార్గో కల్ట్ సైన్స్ ) ను రూపుమాపడం,   ఆటోమేషన్ వల్ల శ్రామికులకు పని లేకపోవడం వంటి సమస్యల పరిష్కారంలో సైన్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది . ఆవిరి యంత్రాలు , రైల్వేలు , విద్యుత్ , శిలాజ ఇంధనాల రాకతో తలెత్తిన సవాళ్ళతో పోలిస్తే 21 వ శతాబ్దంలో ఇన్ఫోటెక్ , బయోటెక్ ల కలయిక వల్ల వస్తున్న సవాళ్లే పెద్దవి . ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల సమాజంలో సుమారు 40  శాతం శ్రామికులకు పని దొరకక ఒక సరికొత్త తరగతి “ నిష్ప్రయోజన తరగతి “పుట్టుకొస్తోంది . ఈ  అత్యంత ప్రమాదకరమైన సవాలును అధిగమించవల్సి ఉంది . కనుక    సైన్స్ ను వివేకంతో లోకవినాశనానికి కాకుండా లోకకళ్యాణం కోసం వినియోగించడం ఒక్కటే మార్గం . “ అందరికీ సైన్స్-అందరి కోసం సైన్స్ “ అనే భావనతో  ప్రజలు , పాలకులు  మరియు పిల్లలు    శాస్త్రీయ దృక్పధాన్ని అలవరుచుకోవడం , సైన్స్ అక్ష్యరాస్యులు గా మారడం ,    ప్రతి క్రియ వెనుక గల  కార్యకారణ సంబంధం గురించి తెలుసుకోవడం ద్వారా వారి  ఆచరణకు , ఆలోచనలకు సమన్వయం ఏర్పడుతుంది . తద్వారా  వారిలో  శాస్త్రీయ ఆలోచనలు , అన్వేషణాతత్వం పెంపొందించబడి అనేక ఆధునిక సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది . ప్రముఖ అమెరికన్ సైంటిస్టు స్టీవెన్ వీన్ బర్గ్ చెప్పినట్లు.. “ ఈ యుగానికి చెందిన ఏ సామాజిక సమస్యనైనా ఎదుర్కొని సాధించడం కేవలం సైన్స్ వల్లనే సాధ్యమవుతుంది “ అన్న మాటల స్పూర్తితో మనం   రాబోయే కాలంలో  మరింతగా శాస్త్ర , సాంకేతిక దృక్పధంతో సామాజిక  సవాళ్లను ఎదుర్కొని   సమసమాజం వైపు అభివృద్ది చెందాలని ఆకాంక్షిద్దాం

Leave A Reply

Your email address will not be published.