బెంగళూరులో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, గౌరవ్‌ కాశీ దర్శన్‌ రైళ్లను ప్రారంభించారు. దీంతో దక్షిణాదిలో అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైలు చెన్నై-మైసూర్ నగరాల మధ్య తిరగనుంది. ఇది దేశంలో అందుబాటులోకి వచ్చిన ఐదో వందేభారత్ రైలు. సోమవారం చెన్నై-మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్‌ విజయవంతమైన విషయం తెలిసిందే.సబర్బన్‌ రైలు మొదలయ్యే లోగా సందడి చేసే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వాణిజ్య నగరాలకు అనుసంధానంగా ఉపయోగపడనుంది. బెంగళూరు- చెన్నై- మైసూరు నగరాల మధ్య తిరిగే ఈ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల ట్రాఫిక్‌ ఒత్తిడి, సమయాన్ని తగ్గిస్తుంది. వేగం, భద్రత, సేవల్లో మెరుగైన పనితీరు వందేభారత్ రైలు ప్రత్యేకతలు. చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ కేవలం 18 నెలల్లో ఈ రైలును పట్టాలు ఎక్కించేందుకు కృషి చేసింది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తుంది. శతాబ్ది రైలు తరహాలో ప్రయాణ తరగతులను కలిగి ఉంటుంది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవం ఇస్తుంది. ఈ రైలు వేగం, సౌలభ్యం పరంగా భారతీయ రైల్వేలకు మైలురాయి వంటిది. మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ-కాన్పూర్-అలహాబాద్-వారణాసి మార్గంలో ప్రారంభమైంది. రానున్న మూడేళ్లలో దేశంలో 400 వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు 2022 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక, త్వరలోనే సరకు రవాణాకు కూడా ఈ తరహా రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది.అలాగే, తక్కువ వ్యయంతో కాశీ యాత్ర భాగ్యాన్ని అందించే మరో పథకం ‘కాశీ దర్శన రైల్వే ప్యాకేజ్‌’. గతంలో ఈ యాత్రకు ప్రభుత్వమే నిర్వహిస్తున్నా.. ఆ వ్యయాన్ని గణనీయంగా తగ్గించేందుకు తాజాగా రైల్వే ప్యాకేజ్‌ పథకం తీసుకొచ్చింది. ఈ టికెట్‌ బుకింగ్‌ ప్రారంభించిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే టికెట్‌లన్నీ బుక్‌ అవటం విశేషం.

Leave A Reply

Your email address will not be published.