రాహుల్ గాంధీని చంపుతామని బెదరింపు లేఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

దేశాన్ని ఏకతాటిపై తెచ్చేందుకు రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఈనెల 20న మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెట్టనున్న నేప్యథ్యంలో ఆయనకు శుక్రవారంనాడు బెదరింపు లేఖ వచ్చింది. ఇండోర్‌లోకి రాహుల్ అడుగుపెట్టగానే ఆయను బాంబులతో చంపుతాంటూ ఒక లేఖ జుని పోలిస్ స్టేషన్ పరిధిలోని ఒక స్వీట్ షాప్ వెలుపల పోలీసులు కనుగొన్నారు. దీంతో వారు అప్రమత్తమై ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్కానింగ్ చేస్తున్నారు. స్వీటు దుకాణం వెలుపల లేఖ విడిచిపెట్టిన వ్యక్తి ఎవరనే దానిపై ఆచూకీ తీస్తున్నారు. బెదిరింపు లేఖకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.కాగా, వీర సావర్కర్‌పై రాహుల్ విమర్శలు చేసిన మరుసటి రోజే ఆయనకు బెదిరింపు లేఖ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సహాయపడ్డాడని, భయం కారణంగానే క్షమాభిక్ష కోరుతూ లేఖ రాసారని రాహుల్ చేసిన విమర్శలు నిరసనలకు దారితీశాయి. క్షమాభిక్ష పిటిషన్ లేఖను చూపిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ సావర్కర్ మనుమడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన కార్యకర్త వందన డోంగ్రో ఫిర్యాదు మేరకు థానే పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మరోవైపు, మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా షేగావ్‌లో భారత్ జోడో యాత్రలో శుక్రవారంనాడు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.