నాడెం చెరువు పై 40 కోట్ల రుణం..ప్రభుత్వ పెద్దలు, అధికారుల మౌనమేలా?

... మూడు బ్యాంకుల్లో రుణాలు పొందిన వైనం ... రుణాల మంజూరు వెనుక బడా నేతల హస్తం? .. బ్యాంక్ అధికారులు రుణాలు పొందిన వ్యక్తులు ములాకత్ అయ్యారా ? .. ఆర్బీఐ నిబంధనలు గాలికి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సామాన్య మానవుడు ఓ చిరు వ్యాపారి తనకున్న వ్యాపారంపై ఒక లక్ష రూపాయలు రుణాన్ని బ్యాంకుల ద్వారా పొందాలంటే సవా లక్ష ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు నిబంధనల ప్రకారం బ్యాంకులో లావాదేవీలు సిబిల్ స్కోర్ ,ఖచ్చితమైన గ్యారెంటీ ఉండాలి అయితేనే బ్యాంకు అధికారులు గ్రౌండ్ రిపోర్ట్ తో పూర్తిగా విచారణ చేపట్టి ఫీల్డ్ ఆఫీసర్ తో సదరు వ్యాపారి లావాదేవీలు వ్యాపారాన్ని పరిశీలించిన తదనంతరమే పూర్తిగా డాక్యుమెంటేషన్ చేసుకున్న తర్వాత రుణాన్ని మంజూరు చేస్తారు. కానీ కేవలం ఒక చెరువు స్థలంపై ఏకంగా మూడు బ్యాంకుల్లో మొత్తంగా 40 కోట్ల రుణం మంజూరవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. వివరాల్లోకి వెళితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువు ఉంది. ఈ చెరువులో కొంతమందికి శిఖం భూమి ఉంది. ఈ భూమిపై ఏకంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలోని ఓ బ్యాంకులో ఇద్దరు వ్యక్తుల పేరిట 40 లక్షల రుణం 7వ తేదీ జూలై మాసం 2015 లో పొందారు. ఇందుకుగాను మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ పరిధిలోని 814 సర్వే నెంబర్లో గల 14,524 చదరపు గజాల స్థలాన్ని బ్యాంకుకు మార్టిగేజ్ చేసి రుణం పొందారు. అదేవిధంగా కూకట్పల్లి ప్రాంతంలోని మరో బ్యాంకులో 28వ తేదీ మార్చి 2014 సంవత్సరంలో 21 కోట్ల 60 లక్షల రూపాయల రుణాన్ని 814 ,816 సర్వే నెంబర్ల పరిధిలో గల 9 ఎకరాల విస్తీర్ణం భూమిపై ముగ్గురు వ్యక్తుల పేరిట రుణం పొందారు. దీంతోపాటు చిక్కడపల్లి బ్రాంచ్ లోని మరో బ్యాంకులో 814 సర్వే నంబర్ గల భూమి పై ఒక మహిళ పేరిట 10 కోట్ల 66 లక్షల 65 వేల రూపాయల రుణాన్ని పొందారు. ఈ రుణాలను సదరు వ్యక్తులు తీసుకున్న నాటి నుండి నేటి వరకు అసలు వడ్డీ చెల్లించకపోవడంతో సుమారు వడ్డీతో కలిపి మొత్తం 40 కోట్లకు చేరింది. దీంతో బ్యాంకు అధికారులు వారికి నిబంధనల ప్రకారం ముందస్తుగా నోటీసులు జారీ చేసి వారు స్పందించని పక్షంలో బ్యాంకులో తనకబెట్టిన స్థలాలను వేలం వేసేందుకు నోటీసులు జారీ చేశారు. తదనంతరం బ్యాంకు అధికారులు సంబంధిత స్థలానికి వెళ్లి చూడగా అది చెరువు అని తేలడంతో ఒకేసారి అవాక్కయ్యారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుతిరిగారు.

రుణాల మంజూరు వెనుక బడా నేతల హస్తం?

నాడెం చెరువు పై కోట్లరూపాయల రుణాల మంజూరి వెనక బడా నేతల హస్తం ఉందని వెంకటాపూర్ గ్రామస్తులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బ్యాంక్ అధికారులు చెరువు వద్దకు వచ్చి స్థలాన్ని పరిశీలించి చెరువు స్థలాన్ని వేలం వేస్తామని తెలిపే సరికి గ్రామంలో చెరువునే ఆధారంగా నమ్ముకొని ఉన్న 106 ముదిరాజ్ కుటుంబాలు ఒకసారి ఉలిక్కిపడ్డాయి. ఏళ్ల తరబడి చేపలు అమ్ముకుంటూ తమ జీవనోపాధి సాగిస్తున్న చెరువు ప్రస్తుతం వివాదంలో చిక్కుకోవడంతో ఒక్కసారిగా ముదిరాజులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంక్ అధికారులు రుణాలు పొందిన వ్యక్తులు ములాఖాత్ అయ్యారా?

లక్ష రూపాయల రుణానందించాలంటేనే సవాలక్ష నిబంధనలు మాట్లాడే బ్యాంక్ అధికారులు సుమారు 40 కోట్ల రుణాలను ఎలాంటి ఫీల్డ్ పర్యవేక్షణ చేపట్టకుండానే కేవలం లింకు డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై కోట్ల రూపాయల రుణం మంజూరు జారీ చేయడంపై బ్యాంక్ అధికారులు రుణాలు పొందిన వ్యక్తులు ములక తయ్యారాన్ని అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

ఆర్బిఐ నిబంధనలు గాలికి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను రుణాల మంజూరులో సదరు బ్యాంకులు గాలికి వదిలేసాయని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. ఏదైనా వ్యాపారాల వ్యాపారులకు గాని వ్యవసాయ పంట పొలాలపై గాని రుణాలు మంజూరు చేయాలంటే సంబదిత వ్యక్తుల పూర్తి వివరాలతో పాటు ఆస్తుల పత్రాలు, వ్యాపార లు భూముల ను ఫీల్డ్ అధికారులు పర్యవేక్షణ చేపట్టిన తర్వాతనే రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఆ నిబంధనలేవి అమలుకు నోచుకో లేదని తెలుస్తోంది.

..ప్రభుత్వ పెద్దలు, అధికారుల మౌనమేల?

చెరువులను సంరక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు ,అధికారులు ఈ వ్యవహారంపై మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది… ఏది ఏమైనప్పటికీ నాడెం చెరువు పై అక్రమంగా పొందిన రుణాల పై పూర్తిగా విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వెంకటాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.