అదర్‌ పూనావాలా ఫొటోతో చీటింగ్‌.. డబ్బు కాజేసిన కేసులో ఏడుగురి అరెస్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(SII) సీఈవో అదర్‌ పునావాలా ఫొటోతో చీటింగ్‌కు పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం పునావాలా ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకొని ఆ కంపెనీకి చెందిన ఓ డైరెక్టర్‌ నుంచి రూ.కోటి కాజేసిన ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. బండ్‌గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సెప్టెంబర్‌ రెండో వారంలో ఈ కేసు నమోదైనట్టు తెలిపారు. పునావాలా ఫొటోను నిందితుడు తన వాట్సాప్‌ ఖాతాకు వాడి.. ‘సీరమ్‌’ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన సతీశ్‌ దేశ్‌పాండేతో చాటింగ్‌ చేశాడని.. డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టినట్టు పేర్కొన్నారు. అయితే, ఆ మెసేజ్‌లన్నీ పునావాలా నుంచే వచ్చాయని నమ్మిన డైరెక్టర్‌ నిందితుడు వాట్సాప్‌ చాటింగ్‌లో పేర్కొన్న ఎనిమిది బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.01 కోట్లను బదిలీ చేశారన్నారు.

ఈ బ్యాంకు ఖాతాలు ఎనిమిది మందికి చెందినవిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఏడుగురిని వేర్వేరు రాష్ట్రాల్లో అరెస్టు చేయగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్టు జోన్‌-II డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ స్మార్థన పాటిల్‌ వెల్లడించారు. ఈ ఎనిమిది ఖాతాల నుంచి డబ్బులు బదిలీ అయిన 40ఖాతాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. అలాగే, రూ.13లక్షలు జప్తు చేశామన్నారు. నిందితులంతా బిహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని.. వీరంతా బీటెక్‌, బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌ చదివారని డీసీపీ వివరించారు. వీరిలో ఒకడు ఓ కమర్షియల్‌ బ్యాంకులో పనిచేస్తున్నట్టు గుర్తించామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సీరమ్‌ సంస్థ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.